Telangana Caste Census: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇందుకోసం కుల గణన చేపట్టాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అనేక ఆందోళనలు కూడా చేశారు. దీంతో ఈ నినాదం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నినాదాన్ని ఎత్తుకుంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని తెలిపారు. అయితే కేంద్రంలో అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు ముందే కుల గణన చేపట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇటీవలే కుల గణన పూర్తి చేసింది. తాజాగా ఆ నివేదికను కేబినెట్ సబ్‌కమిటీ వెల్లడించింది. ఈ వివరాల నివేదికను కుల గణన ప్లానింగ్ మిషన్ అధికారులు అందించారు. మంత్రి ఉత్తమ్‌కుర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
96.9 శాతం కుల సర్వే..
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు డిసెంబర్‌లో కుల గణన చేపట్టారు. పది రోజుల పాటు సర్వే చేశారు. తర్వాత పది రోజులు ఆన్లైన్‌లో నమోదు చేశారు. ఈ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి ఇవ్వగా ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 96.9 శాతం కుల గణన పూర్తయిందని తెలిపారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. కుల గణన సర్వే దేశ భవిష్యత్‌కు ఓ దిక్సూచి అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఈ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 4న నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నివేదికపై చర్చించి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
కులగణన రిపోర్టు ఇలా..
తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554
– మొత్తం కుటుంబాలు 1,12,15,134
– కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా – 61,84,319.. (17.43 శాతం)
– ఎస్టీల జనాభా – 37,05,929.. (10.45 శాతం )
– బీసీల జనాభా – 1,64,09,179 (46.25 శాతం)
– ముస్లింల జనాభా– 44,57,012 (12.56 శాతం)
– బీసీ ముస్లింలు: 35,76,588 (10.08 శాతం)
– ఓసీ ముస్లింలు: 8,80,424 (2.48 శాతం)
– ఓసీల జనాభా– 44,21,115 (13.31 శాతం)
– మొత్తం ఓసీ జనాభా – 15.79 శాతం