CAG report on TG financial status
CAG Report : తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సంరలో అన్ని రకాలుగా అప్పులతో కూడా కలిపి రూ.2.74 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ డిసెంబర్ నాటికి అంటే 9 నెలల్లో కేవలం రూ.1.60 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. టార్గెట్ చేరుకోవాలంటే జనవరి(January) నుంచి మార్చి(March) వరకు మరో రూ.1.14 లక్షల కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలి. ఇదిలా ఉంటే 9 నెలల్లో వచ్చిన రూ.1.60 లక్షల కోట్ల ఆదాయంలో రూ.20 వేల కోట్లు అప్పుల వడ్డీలకే చెల్లించింది. 9 నెలల్లో ఆదాయ వ్యవయాల వివరాలతో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజాగా నివేదిక విడుదల చేసింది. ప్రతీనెల ప్రభుత్వం కాగ్‌కు ఆదాయ, వ్యవయాల వివరాలు పంపుతుంది. ఆ వివరాలను నివేదిక రూపంలో కాగ్ వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 9 నెలల్లో(9 Months) ఆదాయం రూ.1000 కోట్లు తగ్గింది. అంచనా ఆదాయంలో 60 శాతం కూడా ఈసారి దాటలేదు. దీంతో రాబడి పెంచుకునేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆదాయం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తోంది. తదుపరి చర్యలపై దృష్టి పెట్టింది. వచ్చే మూడు నెలల్లో 40 శాతానికిపైగా ఆదాయం అంచనాలను చేరుకోవడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రాంట్లలో భారీగా కోత
రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో నాన్ ట్యాక్స్ రాబడి, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు భారీగా తగ్గాయి. బడ్జెట్(Budjet)లో వేసిన అంచానల్లో 25 శాతం కూడా చేరలేదు. నాన్ ట్యాక్స్ ఆదాయంలో ప్రభుత్వం భూములు అమ్మడం ద్వారా నిధులు సేకరించుకోవాలని భావించింది. కానీ భూములను సేల్ చేయకపోవడంతో తగినంత ఆదాయం సమకూర్చుకోలేదు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్, జీవో 58, 59 వంటి వాటిని కూడా ప్రాసెస్ చేయకపోవడంతో వాటి నుంచి నాన్ ట్యాక్స్ రూపంలో రావాల్సిన రాబడి రావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాన్ ట్యాక్స్ రాబడి మొత్తం రూ.35,208 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి కేవలం రూ.5,487 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే లక్ష్యంలో 15.59 శాతమే చేరుకుంది. ఇక కేంద్రం గ్రాంట్లు కూడా బాగా తగ్గాయి. 2024–25లో రూ.21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయని అంచనా వేయగా రూ.4,771 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 22 శాతమే వచ్చాయి. ఈ రెండింటికి సంబంధిచే రూ.46 వేల కోట్ల లోటు ఉంది. వచ్చే మూడు నెలల్లో పెద్దగా వచ్చేది లేదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. అప్పులు సైతం డిసెంబర్ నాటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. మార్చి నాటికి మొత్తం రూ.49,255 కోట్ల అప్పులు తీసుకోవాల్సి ఉండగా, రూ.48.210 కోట్లు డిసెంబర్ వరకే తీసుకుంది.
సొంత ఆదాయం పెరగలే
గత ఆర్థిక సంవత్సంరతో పోలిస్తే ఈసారి సర్కారు ఆదాయం కూడా పెరగలేదు. పన్ను రాబడిలో గతంకన్నా 3 శాతం తగ్గింది. జీఎస్టీ రాబడి డిసెంబర్ నాటికి రూ.37,664 కోట్లుగా ఉంది. ఆశించిన లక్ష్యంలో 64 శాతం వచ్చింది. గతేడాది జీఎస్టీ రాబడి డిసెంబర్ నాటికి 67 శాతంగా నమోదైంది. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ భారీగా ఆదాయం తగ్గింది. రూ.18,228 కోట్లు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.10,600 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ మొత్తంలో రూ.3,046 కోటుఏ్ల లోకల్‌బాడీలకు స్టాంప్ డ్యూటీని బదిలీ చేయడంతో డిసెంబర్‌లో రూ.7,542 కోట్లుగానే చూపించింది కాగ్. ఇక ఎక్సైజ్ ఆదాయం కూడా ఆశించిన రీతిలో రావడం లేదు. 2024–25లో రూ.25,716 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి రూ.14 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మూడు నెలల్లోనే మరో రూ.11 వేల కోట్లు రాబట్టుకోవాల్సి ఉంది. ఇతర ట్యాక్స్‌లు, డ్యూటీలు కూడా రూ.10,111 కోట్లు అంచనా వేస్తే అందులో సగమే వచ్చాయి.
వడ్డీలకే రూ. 20 వేల కోట్లు..
కాగ్ రిపోర్టు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పుల వడ్డీల చెల్లింపులకు 9 నెలల్లో రూ.19,556.61 కోట్లు చెల్లించినట్లు వెల్లడైంది. ఇక ఉద్యోగుల జీతాలకు రూ.31,584.35 కోట్లు, పెన్షన్లకు రూ.12,585.37 కోట్లు ఖర్చు చేసింది. పథకాల్లో సబ్సిడీలకు సంబంధించి రూ.9,701.50 కోట్లు చెల్లించినట్లు కాగ్ పేర్కొంది.