Nude Videos Business: నగ్న వీడియో కాల్స్ ఉచ్చులో యువత చిక్కుకొని విలవిల్లాడుతోంది. మొన్నటి వరకు ఈ ఉచ్చులో మగవాళ్ళు మాత్రమే బాధితులుగా ఉంటే తాజాగా మహిళలు ఇందులో బాధితులుగా మారుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒకే ఒక్క ఫోన్ కాల్ జీవితాలను తారుమారు చేస్తోంది. ఆనందాలను మాయం చేసి మనోవేదనను మిగులుస్తోంది. ఇప్పటివరకు మగవాళ్ళు మాత్రమే బాధితులుగా అశ్లీల వీడియో కాల్ ఉచ్చులో మహిళలు చిక్కుకుంటున్నారు. పాతికేళ్ళ యువకుడు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫేస్ బుక్ లో పరిచయమైన యువతతో చాటింగ్ చేశాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొద్దిరోజులకు వాట్సప్ నెంబర్ కు నగ్న వీడియో కాల్ చేసింది. ఆ వీడియోను యువకుడు చూస్తున్నట్టు అటువైపు వీడియో తీశారు. ఊహించని ఈ ఘటన నుంచి తేరుకునేలోగానే రెండు లక్షల ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాదంటే ఆ దృశ్యాలను స్నేహితులు, బంధువులకు పంపుతామంటూ బెదిరించారు. దాచుకున్న సొమ్ము నుంచి ఒకసారి రూ. 50 వేలు ఇచ్చి బయటపడ్డాడు. మరోసారి లక్ష చెల్లించాడు. తరచు అట్నుంచి వేధింపులు ఎదురవుతుండడంతో సైబరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పెరుగుతున్న ఈ తరహా కేసులు..
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం వలపు వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరస్థులు పెరుగుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే మూడు కమిషనరేట్ల పరిధిలో 100కు పైగా ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ తరహా కేసులు పెరుగుతుండడం పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
సామాజిక వేదికలే వస్త్రాలు..
పేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, డేటింగ్ యాప్స్.. ఇవే మాయ గాళ్లకు అసలైన ఆస్త్రాలు. స్నేహం పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్లు నింపుతారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ కు స్పందించగానే చాటింగ్ చేస్తారు. అవతలి వారి వయసు, సామాజిక హోదా తదితర విషయాలను ధ్రువీకరించుకుంటున్నారు. రాత్రి దాటాక వాట్సప్ ఫోన్ కాల్ చేసి గంటలు తరబడి మాట్లాడుతున్నారు. బుట్టలో పడినట్లు నిర్ధారణకు వచ్చాక పథకం అమలు చేస్తున్నారు. వాట్సాప్ లో నగ్న వీడియో కాల్ చేసి చూస్తున్నట్టు స్క్రీన్ రికార్డింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. 20వేల నుంచి ఐదు లక్షల వరకు బ్యాంకు ఖాతాలో జమ చేయించుకుంటారు. ఎదురు తిరిగితే సామాజిక మాధ్యమాల్లో ఆ నగ్న వీడియోలు పెడుతున్నారు. అయినా లొంగకపోతే ఫోన్ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలు పంపుతారు. మీ స్నేహితుడు సోదరుడితో కలిసి మీరు నగ్న వీడియోలు చూస్తున్నారు అంటూ మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తాం అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వచ్చే స్నేహ అభ్యర్థులకు స్పందించవద్దని నగర సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కొత్త వారి వీడియో కాల్ స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు.