BRS Supreme Court Shock: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించిన తెలంగాణ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలవలేదు. ఇక కేసీఆర్, కేటీఆర్‌పై విచారణలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కూతురు పార్టీపై తిరుగుబాటు మొదలు పెట్టింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ వీడారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వరుస షాక్‌లతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు సుప్రీం కోర్టు మరో షాక్ ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు–నాగమణి దారుణ హత్య కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021లో జరిగిన ఈ హత్య కేసు నుంచి బయట పడేందుకు మధు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు, అధికార దుర్వినియోగ ఆరోపణల నడుమ సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది.
Also Read: ‘వార్ 2’, ‘కూలీ’ చిత్రాలకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం..!
పట్టపగలు.. నడి రోడ్డుపై దారుణం..
2021లో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోకి కమాన్‌పూర్ మండల పరిధిలో న్యా్యయవాద దంపతులైన గట్టు వామన్ రావు–నాగమణి పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దంపతులు స్థానిక రాజకీయ వివాదాల్లో కీలక పాత్ర పోషించినట్లు, వివిధ రాజకీయ నాయకులతో విభేదాలు ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసుల విచారణలో పలు లోపాలు, ఆధారాల సేకరణలో జాప్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు సరైన దిశలో సాగలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఒక మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆయన మేనల్లుడు నిందితుడిగా ఉన్న నేపథ్యంలో, ఈ ఆరోపణలు మరింత బలపడ్డాయి. అయితే, అప్పటి అధికార పార్టీ మద్దతుతో ఆ ఎమ్మెల్యే కేసు నుంచి తప్పించుకుని, 14 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ హత్య కేసు తెలంగాణ రాజకీయాల్లో లోతైన చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య సంబంధాలు, న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు వంటి అంశాలు బహిర్గతమయ్యాయి. స్థానిక పోలీసుల విచారణలోని లోపాలు, రాజకీయ ప్రమేయం ఈ కేసును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి
Also Read: తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు..!
సుప్రీం కోర్టు జోక్యం..
గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్‌రావు, స్థానిక విచారణలో న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు, ఆధారాల పరిశీలన తర్వాత, సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణ ద్వారా అసలైన నిందితులను గుర్తించి, నిష్పక్షపాతంగా న్యాయం జరిగేలా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణతో కేసులో కీలక పురోగతి సాధ్యమవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.