BRS Social Media: నేటి కాలంలో రాజకీయ పార్టీలకు బలమైన సోషల్ మీడియా ఉండాల్సిందే. నిజమో లేదా అబద్ధమో గట్టిగా చెప్పగలగాలి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. రాజకీయ పార్టీలకు బలమైన సోషల్ మీడియా అనేది ఒక కనీస అనివార్యతగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సోషల్ మీడియాను మరింత పద్ధతిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.. ఏతా వాతా సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు కనీస అవసరం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. దశాబ్ద కాలం రాష్ట్రంలో అధికారానికి దూరమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023లో గద్దెనెక్కింది.. ఇలాంటి క్రమంలో ప్రభుత్వ పథకాలను.. ప్రభుత్వం చేస్తున్న పనులను.. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలంగా చెప్పగలగాలి. అవసరమైతే విస్తృతమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ప్రజల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి.. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిరిగానే ఇప్పుడు కూడా సోషల్ మీడియా ను అంతంతమాత్రంగానే ఉపయోగిస్తుంది.
ఇటీవల కెసిఆర్ బయటికి వచ్చారు. రేవంత్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా మొన్నటి నుంచి అన్ని విభాగాలలో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టింది. అంతేకాదు కేసీఆర్ మాత్రమే తెలంగాణకు రక్షకుడు అన్నట్టుగా ప్రచారం ప్రారంభించింది.. కెసిఆర్ చెప్పిన ప్రతి మాటను నిజమని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో గులాబీ పార్టీ సోషల్ మీడియా విజయవంతమైనది కూడా. వాస్తవానికి ఇలాంటి సమయంలో గులాబీ పార్టీ సోషల్ మీడియాకు బలమైన కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు కర్త ఎవరు? కర్మ ఎవరు? క్రియ ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి కీలక స్థాయిలో పనిచేసిన వారంతా సరైన గుర్తింపు లేకపోవడంతో బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఎవరో కొందరిని రిక్రూట్ చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఆశించిన స్థాయిలో బలాన్ని ఇవ్వలేకపోతోంది.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఎంత బలహీనంగా ఉందో ఏబీఎన్ లో పనిచేసే కీలక న్యూస్ ప్రజెంట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలే బలమైన నిదర్శనం. సోమవారం నాటి ఏబీఎన్ ప్రైమ్ టైం బులిటెన్ లో వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గులాబీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంటే.. కనీసం కౌంటర్ కాదు కదా.. ఏమీ ఇవ్వకుండా ముసుగు తన్ని పడుకున్నారని వెంకటకృష్ణ ఆరోపించారు. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎలా మార్పు చెందాలి? ఎలా బలోపేతం అవ్వాలి? అనే విషయాల మీద ఆ పార్టీ పెద్దలు దృష్టి పెడితే మంచిది. లేకపోతే అంతే సంగతులు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా ముందు అధికార పార్టీ సోషల్ మీడియా సైలెంట్ అయిపోతే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు.
Power of BRS social media!! pic.twitter.com/nQxvDijVeG
— The Samosa Times (@Samotimes2026) December 22, 2025