MLC Kavitha: అధినేత నుంచి సస్పెన్షన్ ఆదేశాలు రావడమే ఆలస్యం.. గులాబీ పార్టీ సోషల్ మీడియా అలర్ట్ అయిపోయింది. నిన్నటిదాకా తన పార్టీలో ఉన్న కవితపై అటాక్ మొదలుపెట్టింది. ముందుగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కవిత ఫోటోలను కార్యకర్తలను చించేశారు. ఫ్లెక్సీలను తొలగించారు. పలుచోట్ల కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు ఆమె దిష్టిబొమ్మలను దాహనం చేశారు. నిన్నటిదాకా కల్వకుంట్ల అని ఉండే ఆమె పేరును.. ఇప్పుడు దేవనపల్లి అని పిలవడం మొదలుపెట్టారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఆమె వల్లే ఓడిపోయామని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
Also Read: అలా సస్పెండ్.. ఇలా దహనం.. కవిత మీద ఇంత ఆగ్రహమా? తెర వెనుక ఉన్నది ఎవరు?
తెలంగాణ భవన్ లో సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, ఇంకా కొంతమంది మహిళ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో కవితపై విమర్శలు చేశారు..”కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాటలు మాట్లాడారు కాబట్టి మా నాయకుడు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తున్నాం. ఆ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఆమెకే కాదు ఎవరికైనా ఇదే గతి పడుతుంది. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మా నాయకుడు చెప్పారు. పార్టీ కంటే కూతురు గొప్పది కాదని నిరూపించారని” సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు..
ఇక అన్ని జిల్లాల అధ్యక్షులు.. ఇతర నాయకులు కవితకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె సస్పెన్షన్ ఆనందంగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పార్టీ హై కమాండ్ నుంచి ఆదేశాలు రాకుండా ఇలాంటి వ్యాఖ్యలు వారు చేయరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గులాబీ పార్టీ ఎంగేజ్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్.. ట్విట్టర్ హ్యాండిల్స్.. ఫేస్బుక్ పేజీలలో కవితకు వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. నాడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె అరెస్టు అయినప్పుడు.. పార్టీ అధినేత పడిన ఇబ్బంది.. ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఇవన్నీ ఆమె వల్లేనని నాయకులు ఆరోపించడం మొదలుపెట్టారు. కవిత పేరు ఆ కుంభకోణంలో వినిపించకుండా ఉండి ఉంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేదని వారు చెబుతున్నారు. మొత్తంగా కవితను ఏకాకిని చేసి.. కార్నర్ చేసే పనిలో పడ్డారు గులాబీ నాయకులు. మరి వీరికి కవిత ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు కొద్ది రోజుల క్రితమే గులాబీ పార్టీ ఈ ఆదేశాలు ఇచ్చిందని.. దాని ప్రకారమే తామ చేస్తున్నామని ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ చెబుతున్నారు. నిన్నటిదాకా తెలంగాణ బతుకమ్మ అని.. కెసిఆర్ గారాలపట్టి అని పిలిచిన వారే.. ఇప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. అందుకే రాజకీయాల్లో నీతి, నియతి ఉండవు అంటారు.
Live: BRS Leaders Press Meet at Telangana Bhavan.
https://t.co/RyKELk46cm— BRS Party (@BRSparty) September 2, 2025