MLA Jagadish Reddy: ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఒక కుగ్రామంగా మారిపోయింది. అమెరికాలోని కంపెనీలు భారత్లో అడుగుపెడుతున్నాయి. భారత్లో పనిచేసే సంస్థలు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశమైన సరే ఇతర దేశాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందువల్లే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. స్థూలంగా చెప్పాలంటే అవసరాలు మాత్రమే ఇప్పుడు ప్రాతిపదికగా ఉన్నాయి. ఇలాంటి చోట ఒక దేశం సేవలు నిలిపిస్తే మరో దేశం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందువల్లే యుద్ధాలు రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అన్నింటికీ మించి రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని భావిస్తుంటారు.
Also Read: బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక.. అసమ్మతి రాజేసిన రాజాసింగ్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు అధికారానికి దూరంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలు రావడంతో ఆ నాయకులకు ఏదీ పాలుపోవడం లేదు. పైగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, గొర్రెల స్కాం.. ఇలా రకరకాల కేసులను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను పలుమార్లు దర్యాప్తు సంస్థల అధికారులు ప్రశ్నించారు.. ఇక కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ విషయంలోనూ కేసీఆర్ నుంచి మొదలుపెడితే హరీష్ రావు వరకు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తీరు పట్ల కొన్ని మీడియా సంస్థలు చెప్పలేని స్థాయిలో కథనాలను ప్రసారం చేస్తున్నాయని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ తరుణంలోనే మహా టీవీ కార్యాలయం పై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారు. తీవ్రస్థాయిలో విధ్వంసం సృష్టించారు. ఒకరకంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికావు. ముఖ్యంగా మీడియా సంస్థలపై కూడా సరికావు. అలాగని మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేయడం కూడా సరికాదు.
ఇక భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థలు కూడా యూట్యూబ్ ఛానల్ కంటే దిగజారిన స్థాయిలో ప్రసారాలు చేస్తున్నాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థలపై దాడులు చేయాల్సిందేనా? ఇలా దాడులు చేస్తూ వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలగదా? ఇలాంటి సంఘటన వల్ల తెలంగాణలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా.. శాంతిభద్రతలు అదుపుతప్పితే తెలంగాణకు పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడులబ్రాకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి ప్రాంతంగా ఎలా ఎదుగుతుంది? ఈ ప్రశ్నలకు గులాబీ పార్టీ వద్ద సమాధానం లేదు. మరోవైపు గులాబీ పార్టీలో సీనియర్ నాయకుడిగా.. గతంలో మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి దాడులను నేరుగా సమర్థిస్తున్నారు. ఇంకా కొన్ని చానల్స్ పై దాడులు చేయాల్సి ఉందని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు.
ఒకవేళ జగదీష్ రెడ్డికి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతే.. అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఆ తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి? రేవంత్ రెడ్డి కాపాడలేడని, చంద్రబాబు అడ్డుకోలేడని జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యానించడం ఏ సంస్కృతికి నిదర్శనం? మీడియాకు విభజన రేఖ గీసే అధికారం జగదీష్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? జగదీష్ రెడ్డి తనను తాను గొప్పగా ఊహించుకుంటున్నారు. తన ఏదో తెలంగాణ సిద్ధాంతకర్త అన్నట్టుగా గొప్పగా ఫీల్ అవుతున్నారు. హైదరాబాదులో ఉండాలంటే తమ వద్ద అనుమతి తీసుకోవాలని.. లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలని అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు.. జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే అంతిమంగా రెచ్చిపోయేది కార్యకర్తలు మాత్రమే. చివరికి బలయ్యేది కూడా వాళ్లే.
నిన్న జరిగింది దాడి కాదు.. నిరసన మాత్రమే.!
ఇంకో రెండు, మూడు ఉన్నయి. వాటి పని కూడా చేస్తాం. మా దాడి వేరే విధంగా ఉంటది.. ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.#BRSParty #JagadishReddy pic.twitter.com/WX0JdCb68A
— Telugu Reporter (@TeluguReporter_) June 29, 2025