Harish Rao: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో కీలక నేత హరీశ్‌రావు. ఇటీవలే గులాబీ బాస్ కేసీఆర్ హరీశ్‌రావును అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్ కలిసి అధికార కాంగ్రెస్‌ను గడగడలాడిస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావుపై తాజాగా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఆయన బీజేపీలోచేరుతారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని బీఆర్‌ఎస్ ఖండించింది. ఇలాంటి అసత్యాలు స్వార్థ లాభాల కోసం కొందరు వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు దీన్ని విశ్వసించవద్దని స్పష్టం చేసింది.
ప్రచారం వెనుక వాస్తవాలు..
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఒక వాట్సాప్ సందేశం ప్రకారం హరీశ్ రావుపై ప్రచారానికి ప్రధాన కారణం. ఇందులో హరీశ్‌రావు ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైనట్లు ఉంది. ఇందులో 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీలోకి అడుగుపెట్టబోతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సమాచారం ఎలాంటి ఆధారం లేకుండా ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ ప్రభావం..
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉండగా, 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నాయకులు పార్టీని వదిలి «అధికార కాంగ్రెస్‌లో చేరారు. వెళ్లారు. ఈ క్రమంల హరీశ్ రావు వంటి సీనియర్ నాయకుడు బీజేపీవైపు చూస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ మెస్సేజ్ ఇది నిజమే అన్నంతగా ఈసారి వైరల్ అవుతోంది.
పట్టుకోసం బీజేపీ ప్రయత్నం..
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్రంలో పట్టు బలోపేతం కావాలనుకుంటోంది. 2029 నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలే హరీశ్‌రావు పార్టీ మార్పు ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు తీసుకొస్తుందని కమలం నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే బీఆర్‌స్ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఇది ‘చిల్లర’ రాజకీయాలుగా అభివర్ణించింది. తమ నాయకులు దృఢంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రచారంపై హరీశ్‌రావు స్పందించకపోవడం కొసమెరుపు.