BJP and BRS: రాజకీయాలలో శాశ్వతంగా కొనసాగే స్నేహితులు.. శాశ్వతంగా కత్తులు దూసుకునే శత్రువులు ఉండరు అంటారు. ఈ వాక్యాలు బిజెపి, బీఆర్ఎస్ విషయంలో నిజం అయ్యాయేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా ఉన్నాయని వారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. గులాబి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాంతంలో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీపై మేడిగడ్డ తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
మేడిగడ్డ లోని రెండు పిల్లర్లు కుంగిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. అప్పటిదాకా పై చేయిగా ఉన్న గులాబీ పార్టీ తగ్గిపోవడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో విచారణకు ఆదేశించింది.. పీసీ ఘోష్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో కెసిఆర్ చేసిన తప్పులను ప్రస్తావించింది. అయితే ఇక్కడే తెలివిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును తేల్చాలని సిబిఐని కోరారు. రేవంత్ సిబిఐ ని కోరి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అడుగుపెట్టలేదు. దీనిపై రేవంత్ ఆరోపణలు మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో చోటు చేసుకున్న అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపకుండా అడ్డు తగులుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపణలు చేసినప్పటికీ వాటి గులాబీ పార్టీ.. ఇటు కమలం పార్టీ నాయకులు ఖండించలేదు. ఈ పరిణామం ద్వారా ఆ రెండు పార్టీల మధ్య పరస్పర అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరోవైపు గులాబీ పార్టీ కూడా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ లాలూచీపడ్డారని.. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఈ ఆరోపణలను అటు కాంగ్రెస్ పార్టీ.. ఇటు టిడిపి నాయకులు ఖండించకపోవడం గమనార్హం. ఇటు రెండు పార్టీలు.. అటు రెండు పార్టీలు పరస్పర అవగాహనతో పని చేస్తున్న నేపథ్యంలో కుమ్మక్కు అనే పదం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ధ్వనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.