Vamsi Tilak: లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేసి విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక లాస్య నందిత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు..
ఇక లాస్య నందిత మరణంతో ఖాళ అయిన కంటోన్మెంట్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఇక అధికారం కాంగ్రెస్ ఈసారి కంటోన్మెంట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బీజేపీ కొత్త అభ్యర్థి వేటలో పడింది.
వంశీతిలక్‌కు బీజేపీ టికెట్..
ఇక భారతీయ జనతాపార్టీ కూడా తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్.వంశీతిలక్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా మంగళవారం ప్రకటించింది.
బ్యాక్ గ్రౌండ్ ఇదే…
కంటోన్మెంట్ అభ్యర్థి కోసం మూడు పేర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలించి జాతీయ నాయకత్వానికి పంపించింది. చివరకు వంశీ తిలక్‌కు టికెట్ ఖరారు చేసింది. వంశీ తిలక్ అందరికీ సుపరిచితుడు కావడంతో ఆయనను ఎంపిక చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. తిలక్ మాజీ మంద్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ.నారాయణ దంపతుల కుమారుడు. వైద్య వృత్తిలో ఉన్నారు. సదాలక్ష్మి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
ముక్కోణపు పోటీ..
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కంటోన్మెంట్‌లో ఈసారి ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. మూడు పార్టీలు కంటోన్మెంట్‌ను తమ ఖతాలో వేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులనే బరిలో దించాయి. ఉప ఎన్నికల మే 13న జరుగుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.