Banakacharla Project : గోదావరి జలాలు వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మదింపు కమిటీ బ్రేక్ వేసింది. వాస్తవానికి దీనికి అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వినతి పత్రాలు అందించారు. లేఖలు కూడా రాశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన వైఖరి తెలియజేయడం.. కేంద్రం ఎదుట తన వాదన వినిపించడంతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కు చెందిన నిపుణుల మదింపు కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో ఏపీ ప్రభుత్వం బనకచర్ల పథకాన్ని నిర్మించే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఈ పథకాన్ని నిర్మించాలనుకుంటే సిడబ్ల్యుసిని సంప్రదించాలని సూచించింది. అయితే సి డబ్ల్యూ సి కి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. వినతి పత్రాలు కూడా అందించింది. బనకచర్ల విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి రెడీ అయ్యారు. అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పార్టీల నాయకులకు ప్రభుత్వం తరఫున సందేశాలు పంపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రావాలని ఆహ్వానించారు.
ఏపీ ప్రభుత్వం గోదారి జలాలపై నిర్మించాలనుకునే పథకానికి వ్యతిరేకంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మదింపు కమిటీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఖుషిగా ఉంది. ఈ క్రెడిట్ తమదే అని చెప్పుకుంటున్నది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలను ముఖ్యమంత్రి వెల్లడించారు..” కొందరు వ్యక్తుల కోసం.. వారి పరిచయాల కోసం తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కులను తాకట్టు పెట్టబోం. గతంలో తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఓ వ్యక్తి కేవలం రాగి సంకటి, రొయ్యల పులుసు కోసమే కృష్ణాజలాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇప్పుడు అలాంటి వాటితో నాకు అవసరం లేదు. మా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కూడా అవసరం లేదు. ప్రజల హక్కులతోనే మాకు సంబంధం. మాకు అహంకారం లేదు. అలా వ్యవహరించాలని కూడా అనుకోవడం లేదు. మాకు రావాల్సిన నీటి వాటా కోసం న్యాయపరంగానే కొట్లాడుతాం. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరించాలని కోరుకోవడం లేదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ ఏపీలో పర్యటించారు. అప్పటి మంత్రి రోజా ఇంట్లో బస చేశారు. ఆమె పెట్టిన రాగిసంకటి, రొయ్యల పులుసు తిన్నారు. అనంతరం రోజా నా బిడ్డ లాంటిదని వ్యాఖ్యానించారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని పేర్కొన్నారు. అంతేకాదు గోదావరి జలాలు న్యాయంగా రాయలసీమకు దక్కాలని పేర్కొన్నారు. అయితే ఏపీలోనూ పాగా వేయాలని కెసిఆర్ అప్పట్లో అనుకున్నారు. దేశంలో చక్రాలు తిప్పుతానని.. గత్తర రేపుతానని వ్యాఖ్యానించారు. కానీ సొంత రాష్ట్రంలోనే కెసిఆర్ పార్టీ ఓడిపోయింది. కామారెడ్డిలో పోటీ చేసిన గులాబీ దళపతి కూడా ఓడిపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో చక్రాలు తిప్పడం పక్కన పెడితే.. సొంత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. ఇక అప్పట్లో రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
“వ్యక్తుల కోసం, ఓ ప్రాంతంలో అధికారం దక్కించుకోవడం కోసం కేసీఆర్ ఎన్నో మాయమాటలు చెప్పారు.. ఆంధ్ర ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. తన పార్టీ పేరు కూడా మార్చారు. చివరికి సొంత రాష్ట్రంలో అధికారం పోవడంతో.. ఇప్పుడు పల్లవి మార్చారు. తన సొంత పత్రికలో అడ్డగోలుగా కథనాలు రాయించారు.. బనకచర్ల పై లేనిపోని ప్రచారం చేయించారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. బనకచర్ల ఆగిపోయింది. దీనిని కూడా గులాబీ పార్టీ నాయకులు తమ విజయం గా చెప్పుకోవడం అత్యంత దారుణమని” కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.