Anirudh Reddy: సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల లోకం. అందులో కనిపించేది ప్రతిదీ కృత్రిమమే. కాకపోతే చిత్ర పరిశ్రమకు విపరీతమైన రీచ్ ఉంటుంది కాబట్టి.. మీడియా కూడా చిత్ర పరిశ్రమ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి.. జనాలకు కాస్త ఆసక్తి ఉంటుంది.. పైగా సినీ తారలు తమను తాము డెమీ గాడ్స్ లాగా భావించుకుంటారు.. అందువల్ల సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఒక వ్యవస్థల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు అండ కూడా వీరికి విపరీతంగా ఉంటుంది కాబట్టి.. ఏమీ చేయడానికి ఉండదు. సినీ తారలు అధికార, ప్రతిపక్ష నేతలతో సమానంగా స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే గోడమీద పిల్లి లాంటి వ్యవహారాన్ని పాటిస్తుంటారు. అందువల్లే సినీ పరిశ్రమలో ఉన్న వారిని ఎవరూ నమ్మరు.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
ఇటీవల కాలంలో తెలుగునాట సినీ పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. భారీ బడ్జెట్ చిత్రాలు అంటూ మీడియాలో ఊదరగొట్టడం.. ఆ తర్వాత టికెట్ రేట్లను పెంచి దోచుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది.. కోర్టులు ఇన్వాల్వ్ ఈ దందాను అడ్డుకుంటే తప్ప చిత్రపరిశ్రమలో ఉన్న పెద్దల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. టికెట్లు దందా మాత్రమే కాదు.. ఇంకా రకరకాల వ్యవహారాలకు సినీ పెద్దలు పాల్పడుతూనే ఉంటారు. రాజకీయంగా అండదండలు ఉండడంతో వారిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. చెరువులను కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడం.. భూములు ఆక్రమించడం.. మత్తు పదార్థాల రవాణా చేయడం వంటి వ్యవహారాలలో సినీ పరిశ్రమలోని కొందరు ఆ రితేరారు.
ఈ వ్యవహారాలు ఇలా ఉండగానే.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. సినీ పరిశ్రమలో మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉన్నవారి చిత్రాలు మాత్రమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పరీక్ష నిర్వహించినప్పుడు నెగిటివ్ వచ్చిన వారి సినిమాలు మాత్రమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ పాజిటివ్ వస్తే సినిమాలలో విడుదల చేయకుండా ఆపాలని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని.. అందులో నెగిటివ్ వస్తేనే చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
అనిరుద్ రెడ్డి ఇటీవల ఇప్ప సారా తయారు చేయాలని.. ప్రభుత్వం దానిని మాత్రమే విక్రయించాలని ఆయన తెరపైకి ఒక డిమాండ్ తీసుకొచ్చారు.. గులాబీ పార్టీ నేతలు అనిరుద్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించాయి. ఇక బిజెపి నేతలైతే ఇందిరమ్మ సారా అని పెట్టండి అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు. దాన్ని కూడా అనిరుద్ రెడ్డి ప్రస్తావించారు. తాను ప్రజల ఆరోగ్యం బాగుండాలని తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొస్తే.. దాన్ని కూడా విమర్శించారని ఆయన మండిపడ్డారు.
అనిరుద్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదన బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సినీ పెద్దలకు మత్తు పదార్థాల పరీక్ష నిర్వహిస్తుందా.. ఆ పరీక్ష నిర్వహించడానికి సినిమా పెద్దలు ముందుకు వస్తారా.. ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న కొంతమంది నాయకులు మత్తుపదార్థాల వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందువల్లే అనిరుద్ రెడ్డి ఈ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా మత్తు పదార్థాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఈగల అనే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశానికి తగ్గట్టుగానే ఈ ప్రతిపాదన తేవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
