Sharmila and Kavitha: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో కీలకమైన కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు స్వార్థ రాజకీయాలతో ఇప్పుడు పావులుగా మారారు. ఒకప్పుడు పార్టీ ఎక్కు పెట్టిన బాణాలుగా గుర్తింపు పొందారు. వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడంతో వైఎస్.షర్మిల, బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమంతోపాటు, తెలంగాణలో అధికారంలోకి రావడంలో కీలకంగా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు ఒకే రకమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ, స్వార్థపూరిత రాజకీయాలకు బలయ్యారు. వారి అన్నలు (వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేటీ.రామారావు)ను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు.
రాజకీయ బాణాలుగా..
వైఎస్.షర్మిల, కల్వకుంట్ల కవిత ఇద్దరూ రాజకీయంగా సమానమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. షర్మిల, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సీపీ) అధినేత జగన్‌తో విభేదాల తర్వాత వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) స్థాపించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా, కవిత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో తన తండ్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), అన్న కేటీఆర్‌తో విభేదాలతో రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు., ఈ ఇద్దరి రాజకీయ వ్యూహాలు, కుటుంబ అంతర్గత విభేదాలు, స్వతంత్ర గుర్తింపు సాధించే ప్రయత్నాలు యాదృచ్ఛికమే అయినా ఒకేలా కనిపిస్తున్నాయి.
అన్నల సహకారం లేక..
షర్మిల, కవిత రాజకీయ బలం వారి అన్నలు. జగన్, కేటీఆర్, అందించే మద్దతుపై గణనీయంగా ఆధారపడి ఉంది. షర్మిల వైఎస్‌ఆర్‌సీపీలో జగన్‌తో విభేదాల తర్వాత సొంత పార్టీ స్థాపించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు, కానీ ఆమె రాజకీయ ప్రభావం జగన్ లేకుండా బలహీనంగా కనిపిస్తోంది. కవిత, బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, తన తండ్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెబుతున్నప్పటికీ, పార్టీలోని ఇతర నాయకుల మద్దతు కోల్పోతున్నారు. అన్నల సహకారం లేకుండా, ఈ ఇద్దరు నాయకులు రాజకీయంగా ఒంటరిగా మిగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మీడియా చేతిలో పావులు..
షర్మిల, కవిత మీడియా ద్వారా తమ రాజకీయ ఎజెండాను ప్రచారం చేస్తున్నారని, అలాగే మీడియా వారిని సంచలనాత్మక వార్తల కోసం ఉపయోగించుకుంటున్నదని విమర్శలు ఉన్నాయి. షర్మిల ఏబీఎన్ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో జగన్‌తో విభేదాలను స్పష్టం చేస్తూ రాజకీయ సంచలనం సృష్టించారు. అదే విధంగా, కవిత టీవీ5 ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ, కేటీఆర్‌తో గ్యాప్‌ను బహిర్గతం చేశారు. ఈ ఇంటర్వ్యూలు మీడియా రేటింగ్‌ల కోసం ఉపయోగించబడుతున్నాయని, ఈ నాయకులు తమ రాజకీయ ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడానికి మీడియాతో రాజీపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇది వారి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
స్వార్థానికి బలి..
షర్మిల, కవిత తమ సొంత రాజకీయ ఆశయాల కోసం లేదా ఇతర రాజకీయ శక్తుల స్వార్థ లక్ష్యాల కోసం ఉపయోగించబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆమె స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నమా లేక ఇతర రాజకీయ శక్తుల ఒత్తిడిమా అనేది చర్చనీయాంశం. కవిత, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌కు లేఖ రాయడం, సొంత కార్యాలయం ప్రారంభించడం ద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేశారు. ఈ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో విభేదాలను బహిర్గతం చేయడం ద్వారా, ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రాలను అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
షర్మిల, కవిత ఇద్దరూ తమ రాజకీయ ప్రయాణంలో కీలక దశలో ఉన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతూ, జగన్‌కు వ్యతిరేకంగా తన రాజకీయ గుర్తింపును నిరూపించుకోవాల్సిన సవాలు ఎదుర్కొంటున్నారు. కవిత, బీఆర్‌ఎస్‌లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి లేదా సొంత పార్టీ స్థాపించే అవకాశంపై ఊహాగానాలు ఉన్నాయి. మొత్తంగా వివాదాస్పద నిర్ణయాలు, కుటుంబ విభేదాలు వారి రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.