Ponguleti Konda Surekha Controversy: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మధ్య ఏర్పడిన వివాదం అంతకంతకు పెరుగుతోంది. ఇద్దరు అత్యంత బలమైన వ్యక్తులు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొండా సురేఖకు ఓఎస్డిగా పని చేసిన సుమంత్ ను అదుపులోకి తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో కొండా సురేఖ అక్కడ లేరు. సురేఖ కుమార్తె సుస్మిత ఉన్నారు. ఆమె టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత సుస్మిత అనేక విషయాలను వెల్లడించారు. దక్కన్ సిమెంట్ నిర్వాహకులను డబ్బుల కోసం సుమంత్ డిమాండ్ చేశాడని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరైన రోహిన్ రెడ్డి ఆ సమయంలో అక్కడ ఉన్నారని.. ఆయన తుపాకిని తీసుకొని సుమంత్ దక్కన్ సిమెంట్ నిర్వాహకుల పాయింట్ బ్లాంక్ లో ఎక్కు పెట్టాడని.. ఈ వ్యవహారాన్ని ఉత్తంకుమార్ రెడ్డి పోలీసుల దాకా తీసుకెళ్లాడని.. అందువల్లే ఈ వివాదం మొదలైందని సురేఖ క్లారిటీ ఇచ్చారు.
సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలలో సంచలనం నెలకొంది. దీనిని మర్చిపోకముందే సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. ఇప్పుడు మధ్యలో సీన్ లోకి కొండ మురళి వచ్చారు. కొండ మురళి హన్మకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.. “సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ విషయం నాకు తెలియదు. నిన్న రాత్రి హైదరాబాదులోని మా ఇంట్లో హై డ్రామా చోటుచేసుకుంది. నా కూతురు పార్టీలో లేదు. పదవిలో అంతకంటే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారు. రేవంత్, పొంగులేటి కలిసి మా ఇంటికి వచ్చారు. వారు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? ” అని మురళి వ్యాఖ్యానించారు.
మరోవైపు సుస్మిత కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తన తండ్రిని టార్గెట్ చేశారని.. ఆయనను అరెస్టు చేసి తన తల్లి పదవిని తొలగించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీలను తొక్కడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కొండ మురళి మాట్లాడిన కొద్దిసేపటికే సుస్మిత ఈ సెల్ఫీ వీడియో విడుదల చేయడం విశేషం.
ఇటీవల మేడారం ప్రాంతంలో ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులు దేవాదాశాఖ పరిధిలో కావడంతో తనకు నచ్చిన వ్యక్తులకు ఇవ్వాలని సురేఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మధ్యలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశించి ఆయన తన కంపెనీకి సంబంధించిన వ్యక్తులకు పనులు అప్పగించినట్లు సమాచారం. దీంతో సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే పొంగులేటి వర్సెస్ సురేఖ అన్నట్టుగా వరంగల్లో రాజకీయాలు మారిపోయాయి. అవి ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారాయి. వీటినిరోధానికి అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇటు రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.