https://oktelugu.com/

Big Shock For Telangana Minister: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఊహించని బిగ్ షాక్

కేటీఆర్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, ఆయన రేవ్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాడని మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సినీ నటులకు కూడా డ్రగ్స్ విక్రయిస్తుంటారని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేస్తుంటారని కామెంట్స్ చేశారు

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2024 / 12:51 PM IST

    Konda-surekha

    Follow us on

    Big Shock For Telangana Minister: కేటీఆర్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, ఆయన రేవ్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాడని మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సినీ నటులకు కూడా డ్రగ్స్ విక్రయిస్తుంటారని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేస్తుంటారని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సినీనటులు నాగచైతన్య-సమంతలు విడిపోవడానికి కారణం కూడా కేటీఆరే అని కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో మంత్రి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగానూ తీవ్ర చర్చకు దారితీశాయి. అటు పొలిటికల్‌గానూ దుమారం రేపాయి. మరోవైపు.. టాలీవుడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనగళం వినిపించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు అంటూ దుయ్యబట్టారు.

    ఈ క్రమంలో తనకు, తన ఫ్యామిలీ పరువుకు మంత్రి సురేఖ వ్యాఖ్యలతో భంగం కలిగిందంటూ మాజీమంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో గత రెండు రోజుల క్రితం కేటీఆర్ నాంపల్లి కోర్టులో తన స్టే్ట్మెంట్ ఇచ్చారు. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని, వ్యక్తిగతంగా తనకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఓ నటిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ జుగుప్సాకర వ్యాఖ్యలు తన నోటితో చెప్పలేనని అన్నారు. దాంతో ఆమె చేసిన వ్యా్ఖ్యలను రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. తాను ఉన్నత విద్యావంతుడిని అని, అమెరికాలో, భారత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేశానని చెప్పారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో నెలకు రూ.4 లక్షల వేతనాన్ని వదులుకొని ఉద్యమంలోకి వచ్చానని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించానని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని వివరించారు. ఈ కేసులో పలువురు సాక్షులను కూడా చేర్చారు. దాంతో కోర్టు బీఆర్ఎస్ నేతలైన జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లను కూడా విచారించింది.

    సురేఖ చేసిన వ్యాఖ్యలు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాల్లోనూ ప్రసారం అయ్యాయని కేటీఆర్ వెల్లడించారు. దీంతో తాము, తమ ఫ్యామిలీ కలత చెందిందని చెప్పారు. మహిళల పట్ల తనకెంతో గౌరవం ఉన్నదని, కొండా సురేఖ సాటి మహిళపైనా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వెల్లడించారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి నిందలు వేశారని కోర్టుకు తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఎట్టకేలకు ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది. కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్య పరిచిందని పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. అలాగే.. మీడియాకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. చానళ్లను ప్రసారమైన కథనాలను, పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా అన్నింట్లోనే కొండా సురేఖ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది. అయితే.. పరువు నష్టం కేసులో ఓ మంత్రిపై కోర్టు ఈ స్థాయిలో మండిపడడం ఇదే తొలిసారి.