amith shah
Amit Shah – Radhakrishna : మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా బిజెపిలో నంబర్_2 కేంద్ర హోంశాఖ మంత్రి, అమిత్ షా గురువారం తెలంగాణలో ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నాడు.. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళిని, అవకాశం ఉంటే అదిపురుష్ ప్రభాస్ ని, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలవబోతున్నాడు. ఇది పైకి చూస్తే మహా సంపర్క్ అభియాన్ లాగానే కనిపిస్తోంది. కానీ బిజెపిలో రెండవ స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఒక అడుగు బయటకు వేశాడు అంటే దాని వెనుక ఏదో రాజకీయ మర్మం దాగి ఉంటుంది. పెట్టుకునే పొత్తో, వేసే చిత్తో కచ్చితంగా ఇమిడి ఉంటుంది.
ఒకింత చర్చనీయాంశం
మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ రాజమౌళిని కలవడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదు.. ఎందుకంటే రాజమౌళి తండ్రి ఆల్రెడీ బిజెపి లోనే ఉన్నాడు. ఆ పార్టీ ఆయనకు రాజ్యసభ స్థానం ఇచ్చింది. ఇక ప్రభాస్ కూడా బిజెపి మూలాలు ఉన్నవాడే. ఎందుకంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గతంలో భారతీయ జనతా పార్టీ టికెట్ మీద ఎంపీగా గెలిచాడు. కానీ ఇక్కడ అమిత్ షా రాధాకృష్ణను కలవడమే ఒకంత ఆచారాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వీలు చూసుకుని ఈనాడు రామోజీరావును రామోజీ ఫిలిం సిటీలో కలిసేవాడు. కానీ ఈసారి ఆశ్చర్యంగా రాధాకృష్ణను కలుస్తున్నాడు. పొలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం రాధా కృష్ణను కలిస్తే చంద్రబాబును కలిసినట్టే.. ఇదంతా కూడా ముంజేతి కంకణం లాంటి వ్యవహారమే.. వాస్తవానికి మొన్న చంద్రబాబు రాధాకృష్ణ ఒత్తిడి వల్లే అమిత్ షాను కలిశాడు అంటారు. అసలు ఆ ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఉండకుంటే ప్రధాని మోదీని కూడా కలిసేవాడని ప్రచారం ప్రచారం జరుగుతోంది. అంటే ఈ లెక్కన చూస్తే మళ్లీ కాషాయం మీదకు పసుపును రుద్దే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టే కదా!
మెల్లిమెల్లిగా జరుగుతోంది
టిడిపికి, బిజెపికి మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గతంలో వాజ్ పేయి హయాంలో పొత్తు పొడిచింది. తర్వాత తెగ దెంపులు అయ్యింది. మళ్లీ 2014లో కమలం, పసుపు దోస్తీ కట్టాయి.. 2018లో విడిపోయాయి. కానీ అప్పుడు జరిగిన పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే కథలు కథలుగా చెప్పుకోవచ్చు.. అమిత్ షా తిరుపతి వస్తే టిడిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. మోదీ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ముద్రించారు.. ఇక చంద్రబాబు అయితే నవనిర్మాణ దీక్ష పేరుతో అడ్డగోలుగా బిజెపి మీద విమర్శలు చేశారు. దీని ఫలితం “23” రూపంలో ఆయనకు వచ్చింది. చంద్రబాబుకు మళ్లీ బిజెపి దోస్తీ కావలసి వచ్చింది..అందుకే తనవైపు బిజెపి మెల్లిమెల్లిగా జరిగే అవకాశాలను ఆయన సృష్టించారు.. ఇందుకు ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ లోని ఒక కీలక వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఆయన సూచనల మేరకే అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. జేపీ నడ్డా వచ్చి జగన్ మీద విమర్శలు చేశారు. అమిత్ షా కూడా వైఎస్ఆర్సిపి విధానాల మీద ఆరోపణలు చేశారు. జగన్ గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలిసినప్పుడు ఇక ఉపేక్ష దేనికి? అవినాష్ రెడ్డిని సి.బి.ఐ అరెస్ట్ చేయకుండా ఎందుకు కాపాడుతున్నట్టు? మళ్లీ ఇదొక డౌటానుమానం. సరే.. ఇప్పటిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ వస్తాడు అని సర్వేలు చెబుతున్నాయి. గతంలో మాదిరి మెజార్టీ రాకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని అవి వివరిస్తున్నాయి. జగన్ తో పోరాడాలి అంటే జగన్ వ్యతిరేక ఓటు చీలవద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టిగా ఆశిస్తున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఆగాధం క్రియేట్ కావాలి. ఎన్నికలవేళ జగన్ ఓటర్లకు ఏమీ పంచకుండా చూడాలి. అధికార దుర్వినియోగానికి అటుకట్ట వేయాలి. ఇదే అటు బాబు, ఇటు పవన్ ఆలోచన. కానీ ఇక్కడే వారు తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
బిజెపి బలం అంతంతే
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బిజెపి బలం అంతంత మాత్రమే.. అలాంటప్పుడు ఈ సయోధ్య కోసం చంద్రబాబు ఎందుకు వెంపర్లాడుతున్నట్టు? పవన్ కళ్యాణ్ ఎందుకు సంధి మార్గం కుదుర్చుకుంటున్నట్టు? ఏపీలో కాంగ్రెస్ జీరో, లెఫ్ట్ పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఈ జాబితాలో మిగిలింది జనసేన, టిడిపి. ఓట్ల కోసం కాకుండా జగన్ ను చక్రబంధంలో పెట్టేందుకు మాత్రమే బిజెపి ఉపయోగపడుతుందని టిడిపి, జనసేన భావిస్తోందా? అంటే ఈ అంచనా మాత్రమే కాకపోవచ్చు, ఇంకా ఇంతకుమించి విస్తృత ఆలోచనలు, సమాలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు దెబ్బకు కేసీఆర్ తో చంద్రబాబు రాజీ కుదుర్చుకుని చంద్రబాబు ఈ రోజులు తెలంగాణలో తన రాజకీయ దుకాణాన్ని మూసేశాడు.. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీని ముందు పెట్టి భారత రాష్ట్ర సమితితో పోరాడుతాడేమో? ఇది కేసీఆర్ కు ఆయాచిత బలంగా మారుతుంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదుగుతున్న బిజెపికి మళ్ళీ ఉరి బిగుసుకుంటుంది. అసలే వర్గ కలహాలతో సోలిపోతుంది. ఒకవేళ టిడిపికి మళ్లీ కొన్ని సీట్లు వస్తే, ఎలాగూ రేవంత్ రెడ్డి తన క్యాంప్ లో మనిషే. ఒకవేళ భారత రాష్ట్ర సమితికి సీట్లు తగ్గిపోతే గేమ్ ప్లే చేయవచ్చని చంద్రబాబు ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కెసిఆర్, ఇటు జగన్ బిజెపిని వ్యతిరేకించలేక కుక్కిన పేన్ల లాగా పడి ఉంటున్నారు. మళ్లీ జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలంటే తానే బెటర్ అనే ఆలోచన బిజెపి నాయకులకు చంద్రబాబు కలిగిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతున్నది.
పావులుగా మార్చుకుంటుందా?
అయితే జగన్ మీద కేసులను అలాగే ఉంచి, తమ అదుపులో ఉంచుకుంటూ, ఇటు చంద్రబాబుతోనూ దోస్తీ కొనసాగిస్తూ.. రేపటి నాడు కేంద్రంలో ఎవరి అవసరం వస్తుందో, ఎవరు కలిసి వస్తారు అనే లెక్కల మీదుగానే బిజెపి తన ప్రయాణం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసు వల్ల కేంద్రానికి సరెండర్ అయ్యాడు. అంతేకాదు కేసీఆర్ ను కాంగ్రెస్, దాని అనుబంధ విపక్షాలు దగ్గరికి రానివ్వడం లేదు. కాబట్టి రేపటినాడు అటు కెసిఆర్, ఇటు చంద్రబాబు, మధ్యలో జగన్ వంటి పావులను వాడుకునేందుకు బిజెపి ప్లాన్ వేసిందన్నమాట?! అయితే ఈ రాజకీయాల కోసం గతంలో చంద్రబాబు విసిరిన నల్ల బెలూన్లు, భార్య ప్రస్తావన, చిల్లర విమర్శలను మోదీ మర్చిపోయాడా? ప్రత్యేక హోదా మీద యూటర్న్ లు, చంద్రబాబు ఓ వైపు, కెసిఆర్ ఓవైపు గత ఎన్నికల్లో విపక్షాలకు డబ్బు సహాయాలు, జాతీయ వేదికల మీద తనను లక్ష్యంగా తీసుకొని కెసిఆర్ చేసిన విమర్శలను మోదీ మర్చిపోయాడు అంటారా? లేక పాపం క్షమించు గాక అని వదిలేసాడంటారా? ఏమోలే రాజకీయాల కోసం గత పగలని పక్కన పెట్టారేమో.. అన్నట్టు అ టిడిపి, బిజెపి మధ్య దోస్తీ కుదరకముందే ఇండియా టుడే పార్లమెంటు స్థానాల్లో గెలిచేది ఎవరు అని ఒక సర్వే ఫలితాన్ని బయటపెట్టింది. ఈ లెక్కన 25 పార్లమెంటు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి 21, టిడిపి, బిజెపి నాలుగు స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. అంటే ఎక్కడో మాడు వాసన వస్తుంది అనేకదా అర్థం! మరి దీనిని అమిత్ షా ఎలా నిలువరిస్తాడో వేచి చూడాల్సి ఉంది.