Allu Arjun: అధికారాన్ని దక్కించుకునే ప్రక్రియలో ఎలాంటి పనినైనా చేయడానికి రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తాయి. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే మయోపయాలు ప్రయోగిస్తాయి.. దేశం మొత్తం మీద పోల్చితే తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కులం, వర్గం, వర్ణం ఆధారంగా రాజకీయాలు సాగుతుంటాయి. ఆ రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అధికారాన్ని దక్కించుకోవడం కోసం చిత్ర విచిత్రమైన ఎత్తులు వేస్తూ ఉంటాయి. ఏ చిన్న అంశం దొరికినా చాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి. భావోద్వేగాలను.. ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొడుతుంటాయి. వాటి మంటల్లో చలికాచుకుంటాయి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొద్దిరోజులుగా అల్లు అర్జున్ కేసు వ్యవహారం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ముగిసిందనుకున్న ఈ కేసు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ మంటలు మండడానికి కారణమైంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన అనంతరం అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన ఘటనలో తన తప్పులేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కాస్త ఘాటుతనం కనిపించడంతో అల్లు అర్జున్ తలవంచక తప్పలేదు. విమర్శలకు బారిన పడక తప్పలేదు.
సందట్లో సడే మియా
ముందుగానే చెప్పినట్టు రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన అంశం దొరికితే చాలు ఎలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అల్లు అర్జున్ కేసును కొంతమంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రాజకీయ పార్టీల నాయకులు దీనిని తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎన్నుకుంటున్నారని.. ఇక్కడ ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వారి పెత్తనం ఏమిటని మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే వారు ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే.. తెలంగాణలో కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఆ మాటకు వస్తే దేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంత ప్రజల స్థిరపడ్డారు. అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. అప్పుడు ఆ రాష్ట్రాల నాయకులు కూడా తెలంగాణ ప్రజలను బయటికి వెళ్లగొడతారా.. తెలంగాణకు వెళ్ళిపోమని నినాదాలు చేస్తారా.. ఆ మాటలను తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా.. అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక ఘటన జరగడం.. దానికి రాజకీయాన్ని ఆపాదించడం.. అంతిమంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం ఇటీవల పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.