Congress Manifesto: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 450కే గ్యాస్ సిలిండర్, చదువుకునే యువతకు ఆర్థిక సహాయం, మహిళలకు ఆర్థిక భృతి, పించన్ పెంపు వంటి ఆరు గ్యారెంటీలను ఎన్నికలకు ముందే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో బాగానే అధికార భారత రాష్ట్ర సమితికి గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తుంది. పోటాపోటీగా ప్రచారాలు, సోషల్ మీడియా వినియోగం, జాతీయస్థాయి నేతలతో మాటా మంతీ వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకుంటున్నది. అంతేకాదు గతానికంటే భిన్నంగా ఏక స్వరం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎన్ని మార్పులు చేస్తామో చెబుతోంది.
అందరినీ ఆకట్టుకునే విధంగా
ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్టు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అదనంగా మరిన్ని హామీలు ఇస్తామని చెబుతోంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే భట్టి విక్రమార్క వరకు చెబుతున్నట్టుగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ధరణి స్థానంలో భూమాత అనే పోర్టల్ ను తీసుకొస్తామని వివరిస్తోంది. భూ సమస్యలకు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలకు సంబంధించి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడం, కౌలు రైతులకు ఏటా ఎకరానికి 15000, వ్యవసాయ కార్మికులకు 12000 వంటి వాగ్దానాలు కూడా కొత్త మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మేనిఫెస్టోను శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీ పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొంటారు.
ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే
రైతులకు రెండు లక్షల రుణాల మాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా.. వంటి కీలకమైన అంశాలు ఈ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సిపిఎస్ ను రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.. దాని స్థానంలో ఓపిఎస్ తీసుకొస్తున్నట్టు సమాచారం.. ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ డిఏల చెల్లింపు, కొత్త పిఆర్సి వేసి ఆరు నెలల్లో వేతన పెంపుదల జరుపనుంది. ఇందిరమ్మ బహుమతి పేరుతో అర్హులైన యువతులకు వివాహం సందర్భంగా లక్ష నగదు, తులం బంగారం అందించనుంది. విద్యారంగానికి 15% నిధుల కేటాయింపు తో పాటు విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్, కళాశాలలకు వెళ్లే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ వంటి పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై..
మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిన నేపథ్యంలో దానిపై సిటింగ్ జడ్జితో విచారణ జరపనుంది.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొంది ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనుంది. దాదాపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీ తో ఆరు నెలల్లో ఉద్యోగ నియామకాలు పూర్తి చేయనుంది. అంతేకాకుండా నాలుగు త్రిబుల్ ఐటీలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ అమరుల తల్లి, తండ్రి జీవిత భాగస్వామికి మెడకు 25వేల గౌరవ పింఛన్, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఎక్సైజ్ పాలస ని సమీక్షించడంతోపాటు.. గుడి బడి చర్చి మసీదు వంటి వాటి పరిసరాల్లో ఉన్న వైన్ షాపులను ఎత్తి వెయ్యనుంది. స్థలం ఉన్న వ్యక్తి కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు అందించనుంది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనుంది. ఇక ఆరోగ్య శ్రీ పథకంలో మోకాలు సర్జరీతో పాటు ప్రధాన వ్యాధులను కవర్ చేసే విధంగా 10 లక్షల బీమా కల్పించనుంది. పాత్రికేయుల సంక్షేమం కోసం 100 కోట్ల అనేది ఏర్పాటు చేయనుంది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షలు, హెల్త్ కార్డులు అందించనుంది. దివ్యాంగులందరికీ ఉచిత రవాణా, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, సర్పంచుల ఖాతాల్లోకి పంచాయతీ అభివృద్ధి నిధుల విడుదల, మధ్యాహ్నం భోజన కార్మికులకు నెలకు పదివేల వేతనం వంటి హామీలు అమలు చేయనుంది.