RK Kotha Paluku: రేవంత్ స్థానంలో మరొక రాజకీయ నాయకుడు ఉంటే.. వేమూరి రాధాకృష్ణ మరో విధంగా రాసేవాడు. కానీ రేవంత్ తనకు ఇష్టమైన వ్యక్తి కావడం.. పైగా కెసిఆర్ కు బద్ధ వ్యతిరేకి కావడంతో.. రాధాకృష్ణ షుగర్ కోటెడ్ హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండకపోతే మునిగిపోతావంటూ అసలు ప్రమాదాన్ని వివరించాడు. ఏ మాటకు ఆ మాట.. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మంత్రులు ఎలా ఉండాలి? ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై రాధాకృష్ణ చాలా లోతుగానే ఈ వారం కొత్త పలుకులో రాశారు.
ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారని.. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆయన పక్కన ఉన్నారని.. ఇటీవల గులాబీ మీడియా ప్రచారం చేసింది. కొన్ని మీడియా సంస్థలు నిజనిర్ధారణ చేసుకోకుండా ఈ విషయాలను డప్పు కొట్టి ప్రచారం చేశాయి. దీంతో ఏం చేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపుకు అర్థం కాలేదు. కనీసం దీనిని ఏ మంత్రులు కూడా ఖండించలేదు. ఎమ్మెల్యేలు సైతం విమర్శించలేదు. దీంతో మల్లికార్జున ఖర్గే నిజంగానే రేవంత్ రెడ్డిని విమర్శించారని.. రేవంత్ రెడ్డి తీరును తప్పు పట్టారనే వార్త నిజమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదని అర్థమైంది. ఫలితంగా రేవంత్ రెడ్డి పై జరుగుతున్న విష ప్రచారం పీక్స్ కు వెళ్లిపోయింది. ఈ దశలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. తనకున్న వేగుల ద్వారా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎఐసిసి అధ్యక్షుడు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సరిగ్గా ఇవే విషయాలను రాధాకృష్ణ తన పత్రికలో రాశారు. సరే ఇవే నిజం అనుకుంటే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి ఎన్ని రకాలుగా చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే గులాబీ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారాలు చేస్తోంది.. సోషల్ మీడియా ను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ విఫలమవుతూనే ఉంది. అసలు సమాచార పౌర సరఫరాల శాఖ అనేది ఒకటి ఉందా అనే అనుమానం కలుగుతోందంటే.. ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇస్తోంది. దీనివల్ల మిగతా మీడియా సంస్థలు.. సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రభుత్వం మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని ఆ సంస్థలు మరింత గొప్పగా చేస్తున్నాయి.
అందువల్లే ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యమంత్రి అత్యంత వ్యూహాత్మకంగా అడుగు వేయాలని.. ఎమ్మెల్యేలు, మంత్రులు మారాలని రాధాకృష్ణ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇలానే వ్యవహరించుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో రేవంత్ రెడ్డికి హిత బోధ చేసింది లేదు. చివరికి మంత్రివర్గ సమావేశంలో.. భట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే తుమ్మల నాగేశ్వరరావు వరకు ఎవరెవరికి ఆయన క్లాస్ పీకింది.. ఎవరెవరిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది.. అన్ని విషయాలను రాధాకృష్ణ బయటపెట్టారు. ఈ ప్రకారం చూసుకుంటే రేవంత్ రెడ్డి తెగించారని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను రేవంత్ ఇచ్చారని రాధాకృష్ణ రాశారు. ఒకవేళ రాధాకృష్ణ రాసినవన్నీ నూటికి నూరు శాతం నిజం అయితే మాత్రం.. ప్రభుత్వంలో ఏదో జరగబోతోందని అర్థమవుతోంది. ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లోనే కాదు, ఎప్పట్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు.