HomeతెలంగాణGadwal : తొలి కాన్పులో పండంటి కూతురు.. రెండవ కాన్పులో ఏకంగా ముగ్గురు.. తల్లీ బిడ్డలు...

Gadwal : తొలి కాన్పులో పండంటి కూతురు.. రెండవ కాన్పులో ఏకంగా ముగ్గురు.. తల్లీ బిడ్డలు ఎలా ఉన్నారంటే?

Gadwal ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల లో ఒక మహిళ తన రెండవ కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ ఆ తల్లి ఆరోగ్యం గా ఉంది.. గద్వాలలోని వడ్డే వీధికి చెందిన జయ శ్రీ, నరేష్ దంపతులు. వీరిద్దరికి 2020లో వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి సంవత్సరానికి జయ శ్రీ గర్భం దాల్చింది. 2022లో పాపకు జన్మనిచ్చింది. ఇక 2023లో రెండవసారి గర్భం దాల్చింది. అయితే ఈసారి ఏకంగా ముగ్గురు పిల్లలు జన్మించారు. వారిలో ఒక పాప.. ఇద్దరు మగ శిశువులు ఉన్నారు.. జయశ్రీ కి డాక్టర్ అశ్విని ప్రసవం చేసారు.. ఇలా ముగ్గురు జన్మించడం.. అది కూడా ఒకే కాన్పులోనే కావడం విశేషమని డాక్టర్ అశ్విని చెప్తున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. జయశ్రీ గర్భం నుంచి ముగ్గురు శిశువులను ఆపరేషన్ ద్వారా బయటకు తీయడానికి డాక్టర్ వినీషా రెడ్డి, డాక్టర్ బిందు సాగర్ సహకరించారని ఆమె పేర్కొన్నారు..” జయశ్రీ మొదటి కాన్పు మా ఆసుపత్రిలోనే జరిగింది. రెండోసారి గర్భం దాల్చిన సమయం నుంచి ఆమె మా ఆసుపత్రికే వస్తోంది.. అయితే ఆమె గర్భంలో ఒకరి కంటే ఎక్కువ శిశువులున్నట్టు మేము గుర్తించాం. ఆమెకు ఈ విషయాన్ని తెలియజేశాం. అయితే క్రమం తప్పకుండా మందులు వాడటం వల్ల గర్భంలో ఉన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. పైగా వారు మూడు కిలోల చొప్పున బరువుతో జన్మించారు. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రేపు ఉదయం లేదా సాయంత్రానికి తల్లి ముర్రుపాలు పట్టిస్తాం. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి పిల్లల్లో నిమోనియా సంబంధిత వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామని” డాక్టర్ అశ్విని వెల్లడించారు.

జన్యువుల వల్లే..

కాన్పులో ముగ్గురు పుట్టడం జన్యువుల మార్పు వల్లేనని వైద్యులు చెబుతున్నారు. ” ఒక స్త్రీ గర్భం దాల్చిన సమయంలో కొన్నిసార్లు జన్యువులు అసంకల్పిత చర్యలకు గురవుతుంటాయి. వాటిని అనేక అంశాలు ప్రేరేపిస్తాయి. కచ్చితంగా ఇదే అంశం వాటిని ప్రభావితం చేసింది అనడానికి ఉండదు. అలాంటప్పుడు గర్భం దాల్చిన స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడే కవలలు లేదా ట్రిపులెట్స్ పుడతారు. అయితే ఆరుదైన సందర్భంగా మాత్రమే పుట్టిన శిశువుల్లో మరణాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఒక స్త్రీ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ప్రతిదీ వైద్యుల పర్యవేక్షణలో జరుగుతున్నది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తల్లిపాల విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. జయశ్రీ విషయంలో జన్యువుల మార్పు జరిగింది. అందువల్లే ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇక్కడ పిల్లలు ఆరోగ్యంగా ఉండడం ఆనందకరమైన విషయం. అయితే ఇటీవల ఏపీలోని ఓ ఆసుపత్రిలో ఇదేవిధంగా ముగ్గురు పిల్లలు జన్మించారు. యాదృచ్ఛికంగా అక్కడ కూడా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ శిశువు కావడం విశేషమని” వైద్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version