Revanth Reddy : రేవంత్ కు తెలియక కాదు.. ఆల్రెడీ ఆ ప్రయోజనం చేకూరింది.. సుప్రీంకోర్టే ఆలస్యంగా స్పందించింది..

"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా అర్సుకుంది సుప్రీంకోర్టు .. ఈ దెబ్బతో మరోసారి ఆయన నోరు తెరవడు. కవిత పులు కడిగిన ముత్యం. సుప్రీంకోర్టు అందుకోసమే బెయిల్ ఇచ్చింది. ఇంకోసారి ఎవరైనా ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు.." సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి తీరును తప్పు పట్టిన తర్వాత గులాబీ క్యాంపు ఇదే విధంగా స్పందిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 9:17 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy :  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఖైదీగా ఉన్నారు. ఐదు నెలలపాటు ఆమె అందులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ఢిల్లీలోని హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఉపశమనం లభించలేదు. చివరికి ముకుల్ రోహత్గీని న్యాయవాదిగా నియమించుకున్న తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజూరు కావడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు పట్టరాని ఆనందంలో ఉన్నారు.. మొన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. అక్కడే ఢిల్లీలో ఉన్న కవిత.. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చారు.. గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ ను కలిశారు. కెసిఆర్ ఆమెను దగ్గరికి తీసుకొని.. అనునయించారు.

రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కవితకు బెయిల్ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మధ్య ఒప్పందం కురవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు.. ఇది సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జాతీయ మీడియా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డికి కావాల్సినంత మైలేజ్ వచ్చింది. ఇదే సమయంలో గులాబీ క్యాంప్ కూడా రేవంత్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చింది. ఓటుకు నోటు కేసును, నేషనల్ హెరాల్డ్ కేసును ప్రస్తావించింది. అయితే ఇది అంతటితోనే ఆగిపోలేదు. ఏకంగా సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించడంతో.. కలకలం నెలకొంది. ఇది సమయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడతారంటూ మండిపడింది. జస్టిస్ గవాయ్, పీకే మిశ్రా, కెవి విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా రెచ్చిపోతోంది.. కానీ

రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే భారత రాష్ట్ర సమితి రెచ్చిపోయింది. ఇప్పటికే హైడ్రా విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డికి కోరుకున్న దాని కంటే ఎక్కువ మైలేజ్ లభించింది. హైడ్రా దెబ్బకు ఒక్కసారిగా రైతుల రుణమాఫీ, ఇతర విషయాలు దారిమళ్ళాయి. దీంతో భారత రాష్ట్ర సమితికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు అవకాశాలు లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పై రేవంత్ వ్యాఖ్యలు చేయడం.. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితికి ఆయాచిత వరం దక్కినట్టు అయింది. ఇంకేముంది దొరికిందే అదునుగా రేవంత్ రెడ్డి పై గులాబీ సోషల్ మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది.. కానీ ఇక్కడే అసలు విషయాన్ని గులాబీ పార్టీ సోషల్ మీడియా మర్చిపోతోంది.

నిబంధనలకు లోబడి..

కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి.. అది న్యాయ నిబంధనలకు లోబడి ఉంటుంది. పైగా సుప్రీంకోర్టు పలు నిబంధనలను కవితకు జారీ చేసింది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కవితకు బెయిల్ రావడం పట్ల చేసిన వ్యాఖ్యలకు సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ మీడియా ప్రముఖంగా రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది. ఈ క్రమంలో రేవంత్ కోరుకున్న దాని కంటే ఎక్కువ ప్రచారం లభించింది. పైగా ఆయన మరింత ఫోకస్ అయ్యారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు కావాల్సింది ప్రచారమే. ఆ విషయంలో రేవంత్ రెడ్డి విజయవంతం అయ్యారు. భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డికి ప్రచారం కల్పించే బాధ్యతను భుజాలకు ఎత్తుకుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. కొద్దిరోజులపాటు ఇది సాగుతూనే ఉంటుంది.. ఇక ఈ గేమ్ లో భారతీయ జనతా పార్టీ ఖండనలు ఇస్తూ ఉంటుంది.. చట్ మాకు, కెసిఆర్ పార్టీకి పొత్తు ఏంటని మండిపడుతుంటుంది. దాల్ మే కుచ్ కాలా హై అనే ప్రచారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఇలాంటప్పుడు బిజెపి నాయకులు ఎలాంటి ఖండనలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషకుల మాట.