Medak : మెదక్ జిల్లాలోని నార్సింగ్ ప్రాంతంలో ఓ వైన్ షాప్ ఉంది. ఇక్కడ అనేక బ్రాండ్లు దొరుకుతాయి. విదేశీ మద్యం కూడా ఇక్కడ లభిస్తుంది. అయితే ఈ వైన్ షాప్ లో దొంగతనం చేయాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. తనకు వచ్చిన ఆలోచనను అమలులో పెట్టాడు. దొంగతనాన్ని కంటే ముందు కొద్దిరోజులు ఈ షాపు ఎదుట రెక్కీ నిర్వహించాడు. షాపులోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఎన్ని గంటలకు తాళం వేస్తారు? సరుకు మొత్తం ఎక్కడ నిలువ చేస్తారు? ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాడు.. తన దొంగతనానికి ఆదివారాన్ని ముహూర్తంగా ఎంచుకున్నాడు. షాప్ మూసే దాకా వేచి చూశాడు. అర్ధరాత్రి గడిచిన తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాపు పైకప్పు తను తెచ్చుకున్న యంత్రంతో ధ్వంసం చేశాడు. ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ వెళ్ళినట్టు లోపలికి వెళ్ళాడు.
లోపలికి వెళ్లిన తర్వాత
ధూమ్ సినిమా రేంజ్ లో లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అతడి కళ్ళను అక్కడ ఉన్న మద్యం సీసాలు మైమరిపించాయి. ఒక్కో బ్రాండ్ అతడిని చూపు తిప్పుకోనివ్వకుండా చేయడంతో.. మద్యం సీసాలను ఒక మూట కట్టాడు.. కౌంటర్ లో ఉన్న డబ్బులను దగ్గర పెట్టుకున్నాడు. ఈలోగా అక్కడ అతడి బ్రాండ్ మందు కనిపించింది. నోరు ఆపుకోలేక.. వెంటనే మందు కలుపుకొని తాగాడు. పరిమితికి మించి మద్యం తాగడంతో అతడు లేచే పరిస్థితి లేకుండా పోయింది. అదే మత్తులో అతడు అక్కడ గాడ నిద్రలోకి జారుకున్నాడు. సోమవారం ఉదయం యజమాని షాపు వద్దకు వెళ్ళగా షాక్ కు గురయ్యాడు. ఐతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్లిపోయారు.. అతని వద్ద మద్యం సీసాలను, నగదును స్వాధీనం చేసుకొని యజమానికి అప్పగించారు. “మద్యం షాపులో చోరీకి వెళ్ళాడు. అక్కడ తను కోరుకున్న బ్రాండ్ లభించింది. చాలా రోజులపాటు కరువుతో ఉన్నాడు కాబోలు.. పీకల దాకా మద్యం తాగాడు. ఆ మత్తులో బయటికి వెళ్లాలి అనిపించలేదు. దీంతో అక్కడే పడుకున్నాడు. తెల్లారి షాపు యజమాని చూసేసరికి మద్యం మత్తులో పడుకుని కనిపించాడు. వెంటనే మాకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్ళాం. అతడిని అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం ఈ కేసు కు సంబంధించి విచారణ నిర్వహిస్తున్నామని” పోలీసులు పేర్కొన్నారు.. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసినవాళ్లు.. ఇతడు మంచి దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి ప్రాంతంలో ఓ దొంగ వైన్ షాపు పైకప్పు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళాడు. మందు సీసాలను మూట కట్టి.. అక్కడ ఉన్న మద్యం తాగి మత్తులో అక్కడే పడుకున్నాడు. తెల్లారి యజమాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అదుపులోకి తీసుకున్నారు.#medak #wineshop pic.twitter.com/gHDbw70NeL
— Anabothula Bhaskar (@AnabothulaB) December 30, 2024