https://oktelugu.com/

KCR – GO 111 : కెసిఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం.. హైదరాబాద్ రియల్ దూకుడుకు కళ్లెం వేసింది

రాష్ట్ర ప్రభుత్వం ఏ ముహూర్తాన 111 జీవో ఎత్తివేసిందో గాని.. ఆ ప్రభావం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై బాగానే పడుతోంది. తూర్పు, పశ్చిమం, ఉత్తరం.. ఇలా అన్ని ప్రాంతాలపై దెబ్బపడుతోంది.

Written By: Rocky, Updated On : May 28, 2023 4:07 pm
Follow us on

KCR – GO 111 : రియల్ రారాజు” మొన్నటిదాకా హైదరాబాదును రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలానే అభివర్ణించేవారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరానికి కూడా మించిపోతోందని లెక్కలు వేసేవారు.. వారి అంచనాలకు తగ్గట్టుగానే మాదాపూర్, నెక్నాం పూర, నానక్ రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, మంచిరేవుల, నార్సింగి, కోకా పేట, మణి కొండ వంటి ప్రాంతాలు స్థిరాస్తి వ్యాపారానికి కేంద్రాలుగా నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే అంతస్తులు వెలుస్తున్నాయి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి వ్యాపారాన్ని ఒక్కసారిగా డైలమాలో పడేసింది.
ఏ ముహూర్తాన నిర్ణయం తీసుకుందో గాని..
రాష్ట్ర ప్రభుత్వం ఏ ముహూర్తాన 111 జీవో ఎత్తివేసిందో గాని.. ఆ ప్రభావం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై బాగానే పడుతోంది. తూర్పు, పశ్చిమం, ఉత్తరం.. ఇలా అన్ని ప్రాంతాలపై దెబ్బపడుతోంది. ఇటీవల హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బాచుపల్లిలో రెండు విడతలుగా ప్లాట్లను విక్రయించగా సగటున చదరపు గజం విలువ దారుణంగా పడిపోయింది. మేడిపల్లిలో ప్లాట్లను వేలం వేసిన సందర్భంలోనూ దాదాపు అదేస్థాయిలో పడిపోవడం రియాల్టీ, అధికార వర్గాలలో ఆలోచన రేకెత్తించింది. రూ.వేలకు వేలు పతనం అవుతుండడం మార్కెట్‌కు శ్రేయస్కరం కాదని రియాల్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్‌కు పశ్చిమాన హైటెక్‌సిటీ ఏర్పాటయ్యాక ప్రణాళికబద్ధ అభివృద్ధి కోసం సైబరాబాద్‌ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ (సీడీఏ) ఏర్పాటు చేశారు. అనంతరం హెచ్‌ఎండీఏలో విలీనం చేశారు. ఐటీ కారిడార్‌ను ఆనుకుని 111 జీవో పరిధిలో అనేక ప్రాంతాలున్నాయి. అక్కడ లే అవుట్లు,భవన నిర్మాణాలు రాకుండా ఆంక్షలుండడంతో ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, పుప్పాలగూడ, నార్సింగి, మణికొండ, కోకాపేట, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్‌, మాదాపూర్‌ తదితర చోట్ల చదరపు గజం రూ.లక్ష దాటేసింది. కోకాపేటలో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం వేస్తే ఎకరం ధర సగటున రూ.45 కోట్లకు అమ్ముడుపోయింది. అపార్ట్‌మెంట్ల చ.అడుగు విలువ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ఐటీ కారిడార్‌లో రూ.8వేలపైగా ఉంది. ఇటీవల ఓ సంస్థ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో చ.అడుగు ధర 16వేలు నిర్ణయిస్తూ భారీ ప్రాజెక్టు తీసుకొచ్చింది.
111 జీవోతో హైదరాబాద్‌కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పరిమితమైంది. జీవో తొలగింపు ద్వారా భూ లభ్యత భారీగా పెరుగుతోంది.
84 గ్రామాల పరిధిలో..
111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూమి ఉండగా, ప్రభుత్వ, సీలింగ్‌, అసైన్డ్‌.. తదితర అమ్మడానికి వీలులేని భూములు 31,483 ఎకరాలున్నాయి. లక్ష ఎకరాల వరకు ప్రైవేటు భూములు అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్‌కు పశ్చిమాన డి మాండ్‌ భారీగా తగ్గనుంది.  ఐటీ ఉద్యోగులు వేతనభత్యాల ఆధారంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. చాలామంది ఉత్తరాన గల నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. దాంతో హైదరాబాద్‌ పశ్చిమం తర్వాత ఉత్తరం భాగంలోనే బహుళ అంతస్తుల భవనాలు, పెద్దఎత్తున నివాసాలు వస్తున్నాయి. హైదరాబాద్‌ పశ్చిమాన 111జీవో వల్ల ఉన్న ఆంక్షలు ఉత్తర, తూర్పు  విస్తరణకు దోహదపడ్డాయి. ఇప్పుడు జీవో తొలగింపుతో ఈ ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి.
హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలంలో స్పష్టం

నగరానికి ఉత్తరం వైపున బాచుపల్లిలో 27.36 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 279 ప్లాట్లతో తూర్పున మేడిపల్లి లో 55.12 ఎకరాలను 434 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ లేఅవుట్లు చేస్తోంది. తొలివిడతగా బాచుపల్లి, మేడిపల్లిలోని ప్లాట్లను మార్చి మొదటి వారంలో విక్రయించింది. డెవలపర్లు, రియల్టర్లు, ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. బాచుపల్లిలో మొదటి విడతలో 50 ప్లాట్లు విక్రయించగా, హెచ్‌ఎండీఏ నిర్ణయించిన చ.గజం కనీస ధర రూ.25వేల కంటే 13,500 అధికంగా పలికింది. అత్యధికంగా చ.గజం ధర రూ.68వేలు, సగటున చ.గజం ధర రూ.59,149 పలికింది. గతంలో పోల్చితే ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగిన ఈ-వేలంలో బాచుపల్లి లేఅవుట్‌లో సగటున చ.గజం ధర రూ.19,475 తగ్గి రూ.39,674 ఖరారయింది. ఇక మేడిపల్లిలో లేఅవుట్‌లో తొలి విడతలో చ.గజం అప్‌సెట్‌ ధర రూ.32వేలు నిర్ణయిస్తే అత్యధికంగా రూ.63వేలు పలికింది. చ.గజం సగటున రూ.58,730 పలికింది. ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన వేలంలో సగటున చ.గజం ధర రూ.18,062 తగ్గి రూ.40,668 ఖరారైంది. ఈ సారి వేలం వేసిన ప్లాట్లలో కొన్ని మిగిలిపోవడం గమనార్హం.

ఇప్పటికే ఐటీ కారిడార్‌పై ప్రభావం
కోకాపేటలో హెచ్‌ఎండీఏ రూపొందించిన నియోపోలిస్‌, గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్లలోని 8 ప్లాట్లను గత ఏడాది వేలం వేశారు. 49.94 ఎకరాలను విక్రయించగా అత్యధికంగా ఎకరం ధర రూ.60.20 కోట్లు, అత్యల్పంగా రూ.31.20 కోట్లు పలికింది.  నియోపోలిస్‌ లే అవుట్‌లోనూ మరో ఆరు ప్లాట్లను విక్రయించడానికి హెచ్‌ఎండీఏ సన్నద్ధమవుతోంది. కోకాపేటలో భూముల వేలంపై 111 జీవో ప్రభావం తీవ్రంగా ప్రభావం చూపుతుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో సగటున ఎకరం ధర రూ.40 కోట్లు పలికితే.. ఈసారి సగానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ప్లాట్లకు ధర నిర్ణయించకుండా ఆన్‌లైన్‌లో వేలం వేయడం  ప్రభావం చూపుతోందని, స్థానికంగా మార్కెట్‌ దెబ్బతింటోందని రియాల్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 111 జీవో తొలగింపు ప్రభావం పశ్చిమానికే పరిమితం కాదని, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలన్నింటిపై ఉంటుందంటున్నాయి.