Constable CPR: ప్రాణం లేచి వచ్చింది : ఉరికి వేలాడి 20 నిమిషాలైంది.. కానిస్టేబుల్ సీపీఆర్ చేసి బతికించాడు!

మార్చి 27న తమిళనాడులో కుటుంబకలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు సీపీఆర్‌ చేసి కాపాడారు.

Written By: Raj Shekar, Updated On : May 3, 2023 11:40 am
Follow us on

Constable CPR: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. మృత్యువు కూడా ఏమీ చేయలేదంటారు. స్వయంగా ఆ యమధర్మరాజే వచ్చినా.. ప్రాణాలు తీసుకుపోలేడంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఊపిరి ఆగిందని వైద్యులు చెప్పినా.. సైన్స్‌కు చిక్కని మెరాకిల్‌లో బతికిన ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా అలాంటి మెరాకిలే ఓ కానిస్టేబుల్‌ చేశారు. చిపోయింది అనుకున్న మహిళకు సీపీఆర్‌ చేసి ఊపిరి పోశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగింది.

చనిపోయిందనుకుని పోలీసులకు సమాచారం..
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్‌ కాలనీ రామకృష్ణ థియేటర్‌ వెనకాల నివాసముంటున్న ఓ మహిళ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు మహిళ చనిపోయిందనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఆ మహిళా ఉరేసుకుని 20 నిమిషాలు అయింది. దీంతో అందరూ చనిపోయిందని భావించారు.

కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తి..
ఘటన స్థలనానికి వచ్చిన కానిస్టేబుల్‌ మల్లేశ్‌ మాత్రం.. అందరిలా చూసి చనిపోయిందని నిర్ధారణకు రాలేదు. ఉరికి వేలాడుతున్న మహిళను నిశితంగా పరిశీలించాడు. ఇంతలో ఆమె కాళ్లు కదిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్‌ మల్లేశ్‌ స్థానికుల సాయంతో మహిళను కిందకు దించాడు.

సీపీఆర్‌తో ఊపిరి..
సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్‌ మల్లేశ్‌.. ఆ మహిళకు సీపీఆర్‌ చేశాడు. కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. దీంతో వెంటనే జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ మల్లేశ్‌ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ఇటీవల తమిళనాడులో..
మార్చి 27న తమిళనాడులో కుటుంబకలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు సీపీఆర్‌ చేసి కాపాడారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెన్నైలోని పాత పల్లవరంలోని శుభంనగర్‌ ప్రాంతంలో తమిళసెల్వి(53) అనే మహిళ తన భర్త శ్రీనివాసన్‌తో కలిసి నివసిస్తోంది. అయితే తమిళసెల్వి కుటుంబకలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌, షేక్‌ మహ్మద్‌, రమేశ్‌ అనే మరో కానిస్టేబుల్‌ కేవలం 7 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గది తలుపులు పగలగొట్టి.. ఉరివేసుకున్న తమిళసెల్విని కిందకు దించారు. అయితే ఆమె అప్పటికే ఊపిరాడక స్పృహ కోల్పోయింది. అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాల్‌ వెంటనే సీపీఆర్‌ అందించి తమిళసెల్వి ప్రాణాలను కాపాడారు. ఇది చూసిన ఆమె కుటుంబసభ్యులు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇటీవల ఆకస్మిక గుండెపోటుకు గురైన వారిని కూడా పోలీసులు సీపీఆర్‌ చేసి కాపాడారు. దీంతో సీపీఆర్‌ ఆవశ్యకత ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది.