https://oktelugu.com/

Land Issue : ప్రభుత్వ భూమిని ఆక్రమించిన.. కష్టపడి కబ్జా చేసినా.. మంత్రి మల్లన్న లాగే అనుచరుడూ..

తాజాగా జవహర్ నగర్ కార్పొరేషన్ లోని కీలక ప్రజాప్రతినిధి మళ్లీ ఆ భూముల్లో కబ్జాలకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్నారు. బాలాజీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఏకంగా 1000 గజాల ప్రభుత్వ స్థలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు.

Written By:
  • Rocky
  • , Updated On : May 16, 2023 9:59 pm
    Follow us on

    Land Issue : అది హైదరాబాదు నగరంలోని జవహర్ నగర్ ప్రాంతం. గజం లక్షల్లో పలుకుతోంది. పైగా అక్కడ బహుళ అంతస్తులు నిర్మిస్తుండడంతో భూమికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుండడంతో రెవెన్యూ అధికారులు వాటిని రక్షించేందుకు నడుం బిగించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పాతారు. రెవెన్యూ అధికారులు ఏ ప్రభుత్వ భూమిని అయితే రక్షించారో.. ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిలోనే ఒక మంత్రి ప్రధాన అనుచరుడు ఏకంగా 1000 గజాల విస్తీర్ణంలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తున్నాడు. అలా నిర్మిస్తున్న వ్యక్తి సాక్షాత్తు జవహర్ నగర్ కార్పొరేషన్ ప్రధమ పౌరురాలు తండ్రి. ఆయనకు మంత్రి ప్రధాన అనుచరుడు అనే ముద్ర ఉంది. మంత్రి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

    ఇదీ కబ్జా చరిత్ర

    జవహర్ నగర్ లోని ఫైరింగ్ కట్ట ప్రాంతంలో సర్వేనెంబర్ 476, 501 పరిధిలో ఏడున్నర ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వాన్ని దంటూ ధరణి వెబ్సైట్లో అధికారులు పొందుపరిచారు. సర్వేనెంబర్ 501 లో 3.25 ఎకరాలు, 476లో 4.6 ఎకరాలు ఉంది. కొందరు ఈ భూములను అక్రమించి నోటరీ పై విక్రయించారు. ఆ భూములను కొన్నవారు నిర్మాణాలకు ముందుకు వచ్చారు. అయితే 2018 ఏప్రిల్ 18న అప్పటి కాప్రా మండల తహసిల్దార్ గా ఉన్న అధికారి ఆ నిర్మాణాలను తొలగించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ బోర్డులు పాతారు. అయితే అప్పట్లో అక్రమార్కులు వెనకడుగు వేశారు. తాజాగా జవహర్ నగర్ కార్పొరేషన్ లోని కీలక ప్రజాప్రతినిధి మళ్లీ ఆ భూముల్లో కబ్జాలకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్నారు.

    కబ్జా చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా బోర్డు పాతుతున్న అధికారులు

    కబ్జా చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా బోర్డు పాతుతున్న అధికారులు

    1000 గజాల స్థలంలో స్విమ్మింగ్ పూల్

    ఇక బాలాజీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఏకంగా 1000 గజాల ప్రభుత్వ స్థలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్విమ్మింగ్ పూల్ తో పాటు ఫామ్ హౌస్ కూడా నిర్మించారు. నేరేడ్మెట్ డివిజన్ ను ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో ఐదు కోట్ల వరకు ఉంటుంది. ఇక ఈ జవహర్ నగర్ లో సదరు కీలక ప్రజాప్రతినిధి తండ్రిదే పెత్తనం కావడంతో ఆయన కబ్జాలకు తరలింపుతున్నారు. ఇక ఆయన వ్యవహార శైలి నచ్చక కొంతమంది కార్పొరేటర్లు నిరసన స్వరం వినిపించారు. అయినప్పటికీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ దీని గురించి పట్టించుకోలేదు.. పైగా కార్పొరేటర్లకు క్లాస్ పీకారు. కబ్జా చేసిన ప్రజాప్రతినిధిని వెనుకేసుకొచ్చారు.

    ఇక ఆ కీలక ప్రజా ప్రతినిధి అనుచరులు కూడా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించడం మొదలుపెట్టారు. అందులో బహుళ అంతస్తులు నిర్మిస్తూ విక్రయిస్తున్నారు. వాస్తవానికి జవహర్ నగర్ కార్పొరేషన్ లో వేల ఎకరంలో ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో స్విమ్మింగ్‌పూల్‌తోపాటు పలు నిర్మాణాలు చేపట్టిన విషయం ఇటీవల రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. గతంలో కూల్చిన స్థలంలోనే నిర్మాణాలు రావడంతో అభ్యంతరం వ్యక్తం చేయడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. దాంతో, ఓ మంత్రి రంగంలోకి దిగి స్విమ్మింగ్‌ పూల్‌వైపు వెళ్లకూడదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దాంతో, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.