BRS: తెలంగాణలో బీఆర్ఎస్ చుట్టూ కుట్ర ప్రారంభమైంది. దానికి ఎల్లో మీడియా విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణలో టిడిపి ఉనికి లేకుండా చేసిన కేసీఆర్ పని పట్టాలని నిర్ణయించుకుంది. పార్టీని కకావికలం చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మొన్నటి వరకు కెసిఆర్ కు బాక ఊదిన ఎల్లో మీడియాలో ఒక సెక్షన్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో యూటర్న్ తీసుకోవడం విశేషం. కెసిఆర్ ఫామ్ హౌస్ వేదికగా.. కేటీఆర్, హరీష్ రావుల మధ్య కొట్లాట కెసిఆర్ అనారోగ్యానికి దారితీసిందని కథనాలు వండివార్చడం విశేషం.
2014 ఎన్నికల తర్వాత అవశేష ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ కు కెసిఆర్ సహకారం అందిస్తున్నారని చంద్రబాబు అనుమానించారు. అందుకే కెసిఆర్ పై గురి పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమికి కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. అయితే ఇదే క్రమంలో తెలంగాణలో టిడిపి ఉనికి లేకుండా కేసీఆర్ చేశారు. 2018లో చంద్రబాబు కాంగ్రెస్ తో కూటమి కట్టి కేసీఆర్ ను ఢీకొట్టారు. అక్కడ కూడా కెసిఆర్ ది పైచేయిగా నిలిచింది. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ కు అన్ని విధాలా కేసీఆర్ సహకారం అందించారు.జగన్ గెలిచారు. ఇప్పుడు తాజా ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించింది.
అయితే ఈ పరిణామాల క్రమంలో ఎల్లో మీడియా చాలా తెలివిగా వ్యవహరించింది. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడుతూనే పరిస్థితికి అనుగుణంగా రంగులు మార్చుతూ వచ్చింది. కెసిఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అధికారం దూరం కావడంతో బీఆర్ఎస్ పై విషం చిమ్మడం ప్రారంభించింది.తెలంగాణలో తెలుగుదేశం ఉనికి లేకుండా చేసిన కెసిఆర్ పని పట్టాలని చూస్తోంది. రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించింది.
తెలంగాణ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ఓటమిపై ఫామ్ హౌస్ లో కెసిఆర్ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎల్లో మీడియా కథనాలను ప్రచురిస్తోంది. తెలంగాణలో ఓటమికి కేటీఆర్ ప్రధాన కారణమని హరీష్ ఆరోపించినట్లు.. చంద్రబాబుపై వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపాయని.. ఈ విషయంలో తప్పిదమంతా కేటీఆర్ దేనిని హరీష్ రావు తేల్చారు అన్నది ఈ కథనం సారాంశం. అయితే దీనిపై కేటీఆర్ ధీటుగా స్పందించినట్లు.. 21 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు తన వర్గాన్ని రూపొందించుకున్నట్లు.. చాలా అవినీతికి పాల్పడినట్లు.. తన వద్ద ఆధారాలున్నాయంటూ కేటీఆర్ స్పష్టం చేశారని.. దీంతో కెసిఆర్ సాక్షిగా వివాదం జరిగిందని ఈ కథనం లో ఉంది. అయితే ఈ కథనం ప్రచురితమైనప్పుడు కెసిఆర్ ఆసుపత్రిలో ఉన్నారు. కానీ ఫామ్ హౌస్ లో ఉండి ఇదంతా జరిగినట్లు ఎల్లో మీడియా కథనాలు రాసుకోచ్చాయి. దీనిని టిఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. టిడిపి తో పాటు ఎల్లో మీడియా కుట్ర ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో బిఆర్ఎస్ అగ్రనాయకత్వం జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి.