Hyderabad Real Estate: మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఏవీ రాడం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు. హైడ్రా కారణంగా విశ్వనగరం ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని పేర్కొన్నారు. కానీ, కాస్త ఓపిక పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంది. విక్రయాల రేటు స్వల్పంగా పెరిగినా, నిర్మాణ అనుమతుల సంఖ్య చూస్తే మార్కెట్‌పై భారీ నమ్మకం పెరుగుతోందని స్పష్టమవుతోంది.
రికార్డు స్థాయిలో అనుమతులు..
2025 తొలి అర్ధభాగంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మొత్తం 922 లేఅవుట్‌లు, ఆకాశహర్మాల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. ఇదే వేగం కొనసాగితే, సంవత్సరం చివరి నాటికి అది 1,800కు పైగా చేరే అవకాశం ఉందని నగర ప్రణాళికా అధికారుల అంచనా. ఈ అప్రూవల్స్ ప్రధానంగా సమతుల్యంగా విస్తరిన ప్రాంతాలకు కేంద్రీకృతమవుతున్నాయి.
– ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, నానకరాం గుడా, కోండాపూర్)
– శంషాబాద్, మెడ్చల్, శంకరపల్లి
– ఘట్‌కేసర్ వంటి పరిసర ప్రాంతాలు
మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రభావం
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్–2, ఔటర్ రింగ్ రోడ్ అప్‌గ్రేడ్‌లు, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ వేగాన్ని పెంచుతున్నాయి. వీటితో పాటు ‘‘ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్’’లు, కొత్త ఇండస్ట్రియల్ కారిడార్‌లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు కూడా రియల్ ఎస్టేట్ వృద్ధికి బలమైన నేపథ్యాన్ని అందిస్తున్నాయి.
దక్షిణ భారత రియల్ హబ్‌గా
సమగ్ర ప్రణాళిక, వేగవంతమైన అనుమతులు, నిరంతర మౌలిక వసతుల విస్తరణతో హైదరాబాద్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రధాన రియల్ ఎస్టేట్ కేంద్రంగా మరింత స్థిరపడుతోంది. ప్రాజెక్టు అప్రూవల్స్ సంఖ్య ఈ నగరం భవిష్యత్ నగర మోడల్‌గా ఎదుగుతున్నదని సూచిస్తోంది.
ప్రస్తుత అప్రూవల్స్ కేవలం నిర్మాణ దశకే పరిమితం కావడం లేదు.. ఇవి దీర్ఘకాల నగర విస్తరణకు మార్గం చూపిస్తున్నాయి. మధ్యతరగతి కొనుగోలుదారులకు సరసమైన ధరల్లో గృహాలు అందుబాటులో ఉంటే, రాబోయే కాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.