https://oktelugu.com/

Indiramma Housing Scheme: నెరవేరనున్న సొంతింటి కళ.. ఇల్లు కట్టుకునే వారి అకౌంట్లోకి రూ.5 లక్షలు

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి నేడు కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు, అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామనే దానిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : December 4, 2024 / 09:25 PM IST

    Indiramma Housing Scheme

    Follow us on

    Indiramma Housing Scheme:అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు హామీలు అమలు చేయగా.. పార్లమెంట్ ఎన్నికల ముందు మరికొన్ని హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. పేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన దరఖాస్తుదారులకు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అర్హులైన పేదలు, ఇళ్లు లేని వారందరికీ దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భూమి ఉన్న వారికి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అలాగే నిరుపేదలకు, ఇళ్లులేని వారికి ప్రభుత్వం భూమితో పాటు 5 లక్షలు అందిస్తామని తెలిపింది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల ఇళ్ల నమూనాలు, డిజైన్లను రూపొందించింది. కొత్త ఇంటి నిర్మాణ నమూనాలు వంటగది, మరుగుదొడ్డి ఉండేలా రూపొందించబడ్డాయి.

    ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి నేడు కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు, అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామనే దానిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సరవేగంగా అమలు చేయబడుతుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ వరకు టెక్నాలజీని విరివిగా వినియోగిస్తామన్నారు.

    ఈ పథకంలో ఎలాంటి అవినీతి తావివ్వకుండా పారదర్శకంగా రాజకీయ ప్రభావానికి అధికారులు లొంగకుండా రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్ తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. లబ్ధిదారులు కట్టుకునే ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో నాలుగు దశల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.

    ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, వంటగది, టాయిలెట్ వంటి సౌకర్యాలు కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో అమలైన కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, లబ్ధిదారులే తమ అవసరాలకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ పథకంలోని ఇళ్లు మహిళల పేరుతో మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఈ మోడల్ ఇళ్ల ద్వారా లబ్ధిదారులకు నమూనా చూపిస్తామని చెప్పారు.

    అర్హులు వీరే..
    * లబ్దిదారుడు దారిద్య్ర రేఖకు (BPL) దిగువన ఉండాలి.
    * రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక చేస్తారు.
    * లబ్ధిదారునికి తన స్వంత ఖాళీ భూమి ఉండాలి. లేదా భూమి ప్రభుత్వమే ఇవ్వాలి.
    * గుడిసెలో ఉన్నా, రేకుల ఇంటిలో ఉన్నా, మట్టిగోడలతో నిర్మించిన తాత్కాలిక గృహంలో ఉన్నా వారు కూడా ఈ పథకానికి అర్హులే.
    * లబ్ధిదారులు అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, వారు కూడా అర్హులే.
    * పెళ్లయినా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.
    * ఒంటరి మహిళలు, వితంతువులు కూడా లబ్ధిదారులు.
    * లబ్ధిదారు తప్పనిసరిగా గ్రామం లేదా మున్సిపాలిటీ ప్రాంతానికి చెందినవారై ఉండాలి.

    దశలవారీగా డబ్బులు మంజూరు
    * తొలుత రూ. బేస్‌మెంట్ స్థాయిలో 1 లక్ష మంజూరు చేయబడుతుంది.
    * మరో రూ. పైకప్పు నిర్మాణ సమయంలో 1 లక్ష ఇవ్వబడుతుంది.
    * పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 2 లక్షలు మంజూరు చేస్తారు.
    * ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు మంజూరు చేస్తారు.