Basavatarakam Cancer Hospital: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్ 23 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వమించారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త వైద్య పరికరాలను బాలకృష్ణ ప్రారంభించారు. ఇటీవలే దేశంలో రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఔట్ లుక్ ఇండియా పత్రిక ప్రకటించింది. ఇక్కడ సేవలందించిన వైద్యులు, సిబ్బంది, దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
విజయవంతంగా సేవలు..
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మొదటి భార్య బసవతారకం జ్ఞాపకార్థం అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 1988లో స్థాపించారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ యుఎస్‌ఏ సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా.. 2000, జూన్ 22న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి గారు ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ హాస్పిటల్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది.
3 లక్షల మందికి చికిత్స..
23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో హాస్పిటల్ ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, అయినా ఎక్కడా వాటి ప్రభావం రోగులపై పడనివ్వలేదు. 23 ఏళ్లలో సుమారు 3 లక్షల మందికి చికిత్స అందించారు. ఆస్పత్రి అభివృద్ధికి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్, డాక్టర్ తులసీదేవి పోలవరపు, డాక్టర్ లూరి దత్తా త్రేయుడు, డాక్టర్ దశరధ రాంరెడ్డి, డాక్టర్ రాఘవ రఘు పోలవరపు, కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు మరెంతో మంది సహకారం అందించారు. అందరి కృషితో ఈ ఆసుపత్రిని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దారు.
తులసీదేవి ఆర్థికసాయంతో..
డాక్టర్ తులసీ దేవి విరాళంగా ఇచ్చిన రూ.1.83 కోట్లు ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. రూ. 7.5 కోట్లు సర్ దురర్జీ టాటా ట్రస్ట్ అందజేసింది. ఈ హాస్పిటల్‌లో ఒక బ్లాక్‌కి ఆయన పేరు పెట్టారు. 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై నేడు 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఒక కన్వెన్షనల్ లీనియర్ యాక్స్‌లరేటర్, రెండు ఐయమ్‌ఆర్‌టి యాక్స్‌లరేటర్స్‌తో మొదటి దశాబ్దంలో ఈ ఆసుపత్రి 350 పడకలకు చేరుకుంది. 2010 తరువాత ఒక కొత్త బ్లాక్‌ని నిర్మించారు.
ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ..
ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించే పేద క్యాన్సర్ రోగులకు ఎయిర్ కండిషన్ వార్డ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంల కోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సులో ఎక్స్ రే, డిజిటల్ మామోగ్రాం, అల్ట్రా సౌండ్ స్కానర్ ఉన్నాయి. డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తిరిగి ఇప్పటివరకు 200 క్యాంపులలో సుమారుగా 3 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.
వసతి గృహానికి విరాళం..
కళాజ్యోతి ప్రాసెస్ ఫౌండేషన్ బహుకరించిన రూ.2 కోట్లతో ఆస్పత్రి ఆవరణలో రోగుల బంధువుల కోసం వసతిగృహం నిర్మించారు. ఈ భవనాన్ని 2017, ఏప్రిల్ 9న నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ వసతి గృహంలో 250 మంది రోగులకు ఉచితంగా లేదంటే తక్కువ ఖర్చుతో వసతి కల్పిస్తున్నారు. సెమెంట్రెన్ ఫౌండేషన్ యూఎస్‌ఎ వారి సహకారంతో 4 వేల మందికి క్రెఫ్ట్ లిప్ సర్జరీస్‌ను ఉచితంగా చేశారు. ఈ హాస్పిటల్‌లో నిపుణులైన సర్జికల్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతరులు కలుపుకుని మొత్తం 2000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.