2.7 Crore Fraud: దూరపు కొండలు నునుపు అంటారు.. దగ్గరికి వెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఆ యువతీకి కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. ఇప్పుడు జరిగింది తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. హైదరాబాదులోని మదీనాగూడకు చెందిన ఓ యువతి (30) స్థానికంగా ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లోవాళ్లు పోరు పెడుతుండడంతో తన ప్రొఫైల్ ను ఓ మ్యాట్రిమోనీ సంస్థలో నమోదు చేసింది. ఆమె ప్రొఫైల్ చూసిన విజయవాడకు చెందిన శ్రీ బాల వంశీకృష్ణ (37) కాంటాక్ట్ అయ్యాడు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. “నేను ఎప్పటినుంచో అమెరికాలో ఉంటున్నా. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొస్తానని” వంశీకృష్ణ చెప్పడంతో ఆ యువతి నమ్మింది. అయితే ఇక్కడే వంశీకృష్ణ తన అసలు సిసలైన చీటింగ్ ప్రణాళిక అమలు చేయడం మొదలు పెట్టాడు.
ఇందులో భాగంగా ఆమె సిబిల్ స్కోర్ తెలుసుకున్నాడు. అయితే ఆ స్కోర్ 743 మాత్రమే ఉండడంతో వీసా రాదని చెప్పాడు. అమెరికా వీసా రావాలంటే 845 ఉండాలని నమ్మబలికాడు. ఇంతటి సిబిల్ స్కోర్ ఉండాలంటే తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని చెప్పాడు. వివిధ కంపెనీల నుంచి రుణాలు ఇస్తానని ప్రకటించాడు. ఇలా ఆమెకు మాయమాటలు చెప్పి ఏకంగా ₹2.71 కోట్లు కొట్టేశాడు.. అతడు చెప్పినప్పుడల్లా ఆ యువతి వంశీకృష్ణ బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయడం మొదలుపెట్టింది. ఇలా 2.71 కోట్లు అతడికి ఆమె పంపించింది. అయినప్పటికీ ఆమె సిబిల్ స్కోర్ పెరగలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ యువతి తెలిసిన వాళ్లని అడిగితే.. సిబిల్ స్కోర్ పెరగాలంటే రుణాలు తీసుకోవడం ఏంటని? సిబిల్ స్కోర్ లేకుంటే బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయని? ఆమెకు అర్థమయ్యేలా చెప్పారు. దీంతో తాను మోసపోయానని ఆ యువతి భావించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ యువతి చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే వంశీకృష్ణ అమెరికాలో ఉంటున్నప్పటికీ.. అతడు అక్కడ ఎటువంటి ఉద్యోగం చేయడం లేదని తెలిసింది. మదీనాగూడ కు చెందిన యువతి మాత్రమే కాకుండా చాలామంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 2011 నుంచి ఇప్పటివరకు అతని మీద 9 కేసులు నమోదయ్యాయి. వీసాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసి పది కోట్ల వరకు కొట్టేశాడు. తన వివరాలను మ్యాట్రిమోనీలో పెట్టడం.. అందమైన యువతుల వివరాలు సేకరించడం.. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడడం.. అమెరికా వీసా పేరుతో వారిలో లేనిపోని ఆశలు కల్పించడం.. ఆ తర్వాత డబ్బులు వసూలు చేయడం.. వంశీకృష్ణ పరిపాటిగా మార్చుకున్నాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు. అతడి వీసాను రద్దు చేసేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది.