Homeప్రత్యేకంIT companies : హైదరాబాద్ 100 కోట్ల భారాన్ని"ఐటీ కంపెనీలు’ మోయగలవా?

IT companies : హైదరాబాద్ 100 కోట్ల భారాన్ని”ఐటీ కంపెనీలు’ మోయగలవా?

IT companies : హైదరాబాద్‌ భూముల ధరలు అందుబాటులో ఉండడం వల్లే బహుళ జాతి కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. బెంగళూర్‌, చైన్నై కంపెనీలు కూడా తరలివచ్చాయి. తాజాగా నియోపోలిస్‌ వేలం చుట్టు పక్కల భూముల ధరలపై ప్రభావం చూపుతోంది. గండిపేట వద్ద ఎకరం రూ.35 కోట్లు ఉండేది ఒక్కసారిగా రూ.50 కోట్లకు వెళ్లింది. బహుళ జాతి కంపెనీలు భూముల ధరలు తక్కువగా ఉంటే ఆఫీసు స్పేస్‌ను లీజుగా తీసుకోవడం కన్నా కొనడానికే ఆసక్తి చూపుతాయి. తాజా ధరలతో వాటికి ఆ వెసులుబాటు లేకుండా పోయింది. కోకాపేట భూముల ధరల ప్రభావంతో భవిష్యత్తులో ఆఫీసు స్పేస్‌ కోసం భవనాలు నిర్మించాలన్నా ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఇంత ధరలు పెట్టి హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌ అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీలకు లేదు. హైదరాబాద్‌లోనే పోచారం, ఆదిభట్ల, కొంపల్లి ఇలా నగరానికి అన్నివైపులా ఐటీ స్పేస్‌ విస్తరిస్తేనే నగరంలో ఈ రంగం నిలబడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీ కంపెనీలకు ఎక్కడ పని చేసినా టెక్నాలజీ ఒక్కటే ఉంటుంది. కీలకమైనవి మానవ వనరులే. ఉద్యోగులకు తక్కువ జీవన వ్యయంలో ఆఫీసు, ఇతర మౌలిక వసతులు ఎక్కడ దొరుకుతాయో, అక్కడికే కార్యాలయాలు తరలి పోతాయి. హైదరాబాద్‌కు చౌక అడ్వాంటేజ్‌ పోయిందంటే ఇక్కడి నుంచి కంపెనీలను తరలించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించవు.

దేశ ఐటీ రాజధాని బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ నగరంలో ఐటీ ఎదుగుతూ వచ్చింది. దీనికి కారణం హైదరాబాద్ నగరానికి ఉన్న అనుకూలతలే. బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ, కోల్ కతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాదులో జీవన వ్యయం చాలా తక్కువ. ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడి తక్కువ అద్దెలు చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోయేవారు. ఐదు సంవత్సరాల క్రితం 30 నుంచి 50 లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనగలిగే పరిస్థితి ఉండేది. ఔటర్ రింగ్ రోడ్డు దాటితే గజం పదివేలకు భూమి దొరికేది. మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాదు ఉత్తమమంటూ ఉత్తరాది ఐటీ ఉద్యోగులు బెంగళూరు, ముంబై, పుణె, గుర్గావ్ లను కాదని హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపారు. బెంగళూరు లాగానే హైదరాబాదులో ఒక్క పోయని సమతుల్య వాతావరణం ఉండేది. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉండడంతో ట్రాఫిక్ కష్టాలు పెద్దగా ఉండేవి కావు. అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి ఐటీ కారిడార్ లో వచ్చిన భారీ భవంతులు ఇటీవల కాలంలో ట్రాఫిక్ చిక్కులను కలిగిస్తున్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కు పరిమితి అంటూ లేకపోవడంతో ఎకరానికి ఐదు లక్షల చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టగలిగే అవకాశం ఉండడంతో భారీ భారీగా నిర్మాణాలు వచ్చాయి.

భారీ నిర్మాణాలకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, కోకాపేట జంక్షన్ వద్ద సాయంత్రం పూట భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని తగ్గించేందుకు నార్సింగ్ వద్ద కొత్త ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేశారు. కోకాపేట నియో పోలిస్ వద్ద మరో ఇంటర్ చేంజ్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ అనుకూలతలను సొమ్ము చేసుకునేందుకు స్థిరాస్తి వ్యాపారులు భూముల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. దీంతో అన్ని వర్గాలకు అందుబాటులో ఇళ్ళు దొరికే పరిస్థితి మాయమైపోయింది. ఇప్పుడు నగరంలో ఏ మూలకు వెళ్లినా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తక్కువలో తక్కువ 60 లక్షలు పలుకుతోంది. ఐటీ కారిడార్ లో అయితే కోటి దాకా చెల్లించాల్సి వస్తోంది. దానికి అనుగుణంగానే అద్దెలు కూడా భరించలేనంత స్థాయికి వెళ్లిపోయాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version