Google AI Data Centers: రాతియుగం నుంచి మనిషి నవీన యుగంలోకి వచ్చేసాడు. మనిషికి ఉన్న మేధస్సు వల్ల నవీన యుగం నుంచి సాంకేతిక యుగంలోకి వచ్చేసాడు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతీది కూడా సాంకేతికత తో ముడిపడి ఉంది.. ప్రస్తుతం మనిషి చేస్తున్న ప్రతి పని కూడా సాంకేతికత ఆధారంగానే నడుస్తోంది. అందువల్లే టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గడచిన కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ అనేక రకాలుగా మార్పు చెందింది. రోజురోజుకు అత్యాధునికమైన పరిజ్ఞానం మనిషి జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చేస్తోంది.
ఒకప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీ గొప్పది అనుకునేవారు. ఇప్పుడు ఏకంగా కృత్రిమ మేధ లోకి మనిషి ప్రవేశించాడు. ఇందులో కూడా రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా కృత్రిమ మేధా ఆధారంగానే సమాచార కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ప్రఖ్యాత గూగుల్ సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్లపై ఎప్పటినుంచో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ సమాచారం వేగంగా పెరిగి పోతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో భారీ ఎత్తున సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడంతో.. ఆసియాలో అతిపెద్ద దేశాలలో ఒకటైన ఇండియాలో కూడా విస్తరిస్తున్నాయి. సమాచార కేంద్రాల వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమవుతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. సాంకేతికపరంగా కొత్త వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.
ఇక ఏపీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మిస్తున్న నేపథ్యంలో.. విశాఖపట్నం ఓడరేవు ప్రాంతంలో 1 గిగా వాట్ డేటా క్యాంపస్ నిర్మాణం కాబోతోంది. దీనివల్ల వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వచ్చే ఐదు సంవత్సరాలలో google సంస్థ 1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. కృత్రిమ మేధ ద్వారా రాష్ట్రానికి సుమారు పదివేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధ శక్తివంతమైన కంప్యూటింగ్ అవసరాన్ని పెంచుతున్నది.
సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం పెరిగిపోతోంది. రవాణా విషయంలో కూడా కొత్త విధానాలు అందుబాటులోకి వస్తాయి. ఇంజనీరింగ్ వ్యవస్థలు పూర్తిగా మారిపోతాయి. సేవరంగాలు సరికొత్త విధానంలో అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు ఐర్లాండ్ ప్రాంతంలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తే.. అక్కడ స్థానికులకు విస్తారంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వందలాది స్థానిక కాంట్రాక్టర్లకు పని లభించింది.
డాటా సెంటర్ల వల్ల ప్రత్యక్షంగా ఐటి ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది. నెట్వర్క్ విభాగంలో సరికొత్త అవకాశాలు లభిస్తాయి. నెట్వర్క్ మానిటరింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ విభాగాలలో ఉద్యోగాలు లభిస్తాయి. సప్లై చైన్ విభాగంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. హోటల్, ఫుడ్ విభాగాలలో ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయి.
డేటా సెంటర్ ఉన్న ప్రాంతాలలో ఫైబర్ కనెక్టివిటీ విస్తృతం అవుతుంది. విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుంది. మౌలిక సదుపాయాలు విస్తృతం అవుతాయి. స్థానికంగా ఉండే అంకుర సంస్థలకు కూడా సరికొత్త శక్తి ఇస్తుంది.
గూగుల్ తన సమాచార కేంద్రాలకు పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలని నిర్ణయించింది. అందువల్లే కార్బన్ ఫ్రీ ఎనర్జీ పై మాత్రమే తమ పని చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్లే విశాఖ డాటా కేంద్రానికి గ్రీన్ ఎనర్జీ వాడుతున్నారు. ఇక పర్యావరణపరంగా కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. భారీగా వెలువడే ఉష్ణోగ్రతను తగ్గించడానికి విస్తారంగా మొక్కలు నాటుతున్నారు.