Threads Vs Twitter: ఇన్నాళ్లు మైక్రో బ్లాగింగ్ విభాగంలో ట్విట్టర్ దే హవా. పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు దీని వాడకం పెరిగిపోయింది. ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను తట్టుకొని ట్విట్టర్ నిలబడిందంటే దానికి కారణం అది తీసుకొచ్చిన మార్పులే. మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులకు గురైనప్పటికీ ట్విట్టర్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే.. పైగా దీనిద్వారా లాభాలు ఆర్జించేందుకు మస్క్ ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. వాటిలో కొన్ని విజయవంతం కాగా.. మరికొన్ని విఫలమయ్యాయి. అయినప్పటికీ ట్విట్టర్ ను ఎదిరించే యాప్ పుట్టలేదని పలు మార్లు మస్క్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు అతనికి సరికొత్త పోటీ ఎదురు కాబోతోంది..
ఎలన్ మస్క్ సారథ్యంలోని మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ ఆధ్వర్యంలోని మెటా టెక్స్ట్ బేస్డ్ సంభాషణల యాప్ తీసుకొస్తోంది. ట్విట్టర్ ను పోలివున్న ఫీచర్లతో ఉన్న ఈ యాప్ కు “థ్రెడ్స్” అనే పేరు పెట్టారు.. దీనిని ఆల్రెడీ మెటా కంపెనీ యూజర్లకు పరిచయం చేసింది.. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
తన ఇన్ స్టా గ్రామ్ బ్రాండ్ పేరు మీద మెటా తీసుకొస్తున్న ఈ యాప్ లో టెక్స్ట్ రూపంలోని పోస్టులను లైక్ చేయవచ్చు. కామెంట్, షేరింగ్ వెసలు బాటు కూడా ఉంది. ఈ మేరకు యాప్ స్టోర్ లిస్టింగ్ లోనూ థ్రెడ్స్ స్క్రీన్ షాట్ జోడించింది. ఇన్ స్టా గ్రామ్ యూజర్లే థ్రెడ్స్ యాప్ లోనూ ఫాలో అయ్యే అవకాశం ఉంది.. కాగా దీనిపై అధికారికంగా ప్రకటించేందుకు ఇన్ స్టా గ్రామ్ ఇంతవరకూ ముందుకు రాలేదు.
ఇక ట్విట్టర్ ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటినుంచి సంస్థలు అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ట్వీట్లను చూసేందుకు యూజర్లకు సంస్థ కొన్ని పరిమితులు విధించింది. అయితే పాలసీపరమైన మార్పులు ఇష్టపడని వారు కొత్త వేదికల కోసం ఎదురుచూస్తున్న వేళ ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కొత్త మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ను సిద్ధం చేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ కి ఉన్న పాపులారిటీతోపాటు ఆ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మెటా సరికొత్త కొత్త యాప్ తయారు చేసింది. అంతేకాదు యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల సెలబ్రిటీలు, ప్రభావశీల వ్యక్తులతో భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. అయితే ట్విట్టర్ కు పోటీగా ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తీసుకువచ్చిన బ్లూ స్కై, మాస్టో డాన్ తీసుకువచ్చిన యాప్ లు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. కాగా మెటా పోటీకి వస్తున్న నేపథ్యంలో ట్విట్టర్లో మరికొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లోనూ సరికొత్త పోటీకి తెరలేవబోతోంది.