https://oktelugu.com/

Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త ప్రయోగం.. ఇకపై విద్యార్థుల సొంత కవిత్వం కుదరదు..

వార్షిక పరీక్షల సమయంలో ఏదో ఒకటి రాసినా మార్కులు వస్తాయని విద్యార్థుల్లో ధీమా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటిని సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయులు కూడా గుర్తించలేరు. పైగా విద్యార్థి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని మార్కులు వేస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఎత్తుగడలు కొనసాగవు. ఎందుకంటే జవాబు పత్రాలను దిద్దేది ఉపాధ్యాయులు కాదు.. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయోగం తమిళనాడులో ప్రారంభమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 11, 2024 / 06:25 PM IST

    Artificial Intelligence

    Follow us on

    Artificial Intelligence : వార్షిక పరీక్షలలో వచ్చిన ఫలితాలు విద్యార్థి ప్రతిభ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే కొందరి విద్యార్థులు సబ్జెక్టు పై అవగాహన లేకపోవడం, చదువుపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం.. వంటి కారణాలతో ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు రాస్తుంటారు. సందర్భాల్లో వీటిని దిద్దే ఉపాధ్యాయులు కూడా గుర్తించలేరు. అయితే ఇకపై ఇలాంటి విధానాలకు చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది.. విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దిద్దే విధానానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అక్కడి విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పని తీరును పూర్తిగా అన్వయించుకొని.. లోపాలను సరి దిద్ది.. పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చిన అనంతరం అన్ని విశ్వవిద్యాలయాల్లో దీనిని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఈ వ్యవహారాన్ని ఆ రాష్ట్ర ప్రణాళిక కమిషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

    ఒక కాపీని స్కాన్ చేసి..

    ఆన్సర్ షీట్ల ను దిద్దే క్రమంలో ముందుగా ఒక కాపీని స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఇంటర్ లింక్ చేస్తున్నారు. దానిని అది పరిశీలిస్తుంది. ఆ తర్వాత సంబంధం లేని సమాధానాలను.. అదేపనిగా పునరావృతం చేసిన విషయాలను పట్టుకుంటుంది. ఆ తర్వాత వెంటనే సంబంధిత ఉపాధ్యాయుడిని హెచ్చరిస్తుంది. ” వాస్తవానికి ఒక్కో విద్యార్థి చేతిరాత ఒక్క విధంగా ఉంటుంది అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే విడతలవారీగా ఈ క్రతువును డెవలప్ చేయాలి. ప్రస్తుతం మూల్యాంకనంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రొఫెసర్లకు సహాయంగా ఉండేందుకు ఒక టూల్ మాత్రమే వినియోగిస్తున్నాం. పేపర్లో లోపాలను గుర్తించే వేగం మాత్రం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ఎక్కువగా ఉంది. వచ్చే కాలంలో దీనిని మరింత పెంచుతాం. దాని సామర్ధ్యాన్ని విస్తరిస్తాం. జవాబు పత్రాలను దిద్దే క్రతువులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించాలనేది మా లక్ష్యమని” తమిళనాడు ప్రణాళిక కమిషన్ కార్యదర్శి సుధ ప్రకటించారు.

    ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్

    మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పేపర్ వ్యాల్యూషన్ కోసం నాలుగు యూనివర్సిటీలను ఎంపిక చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆన్సర్ షీట్లను ఆయా యూనివర్సిటీ అధ్యాపకులు వాల్యూయేషన్ చేస్తున్నారు. దానికంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమాధాన పత్రాలను దిద్దిస్తున్నారు. రెండు విధానాల వల్ల జరుగుతున్న మార్పులను ఆయా యూనివర్సిటీల ప్రొఫెసర్లు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించారు. మూల్యాంకనం అనంతరం వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ప్రశ్న పత్రాలను ఇంటర్ లింక్ చేయడంతో పాటు విషయ పరిజ్ఞానానికి సంబంధించిన నిబంధనలను కూడా రూపొందిస్తున్నారు.. దీనిపై ఇప్పటికే తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.