Taxation of UPI and E-Wallet Transactions: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం.. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. పట్టణాలు నుంచి పల్లెల వరకూ ఇప్పుడంతా డిజిటల్ పే విస్తరించింది. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకూ లావాదేవీలంతా డిజిటల్ పే ద్వారానే జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ తరువాత నగదురహిత లావాదేవీలకే ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తోంది. అయితే ఏదీ ఊరకనే కాదు అన్నట్టు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులపైనా వడ్డనకు కేంద్రం సిద్ధపడుతోంది. బ్యాంకులో అమౌంట్ వస్తే చార్జీ, విత్ డ్రా చేస్తే చార్జీ, ఏ వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా చార్జీ వసూలు చేసిన కేంద్రం ఇప్పడు డిజిటల్ పేమెంట్లపైనా చార్జీలు వసూలు చేయడానికి నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తూనే ఈ కొత్త ఎత్తుగడ ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ జేబులో రూపాయి లేకున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోయేది. నిశ్చింతగా లావాదేవీలన్నీ జరిగిపోయేవి. ఇక నుంచి అటువంటి పరిస్థితి ఉండదని తెలియడంతో డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడిన వారిలో ఆందోళన ప్రారంభమైంది. ముందు ప్రోత్సహిస్తున్నారు. అలవాటు చేస్తున్నారు. ఎడిక్ట్ అయిన తరువాత ప్రతాపం చూపుతున్నారు. గతంలో ఏటీఎం కార్స్డ్ విషయంలో కూడా ఇలానే చేశారు. ఇప్పుడు డిజిటల్స్ పేమెంట్స్ వంతు వచ్చిందన్న మాట.
ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లే..
చిన్నపాటి వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా కొనుగోలులో ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్లే చేస్తున్నారు. అంతెందుకు టీ తాగేవారు కూడా ఇప్పుడు డిజిటల్ పే చేస్తున్నారు. చిన్న దుకాణదారులు కూడా ఇప్పుడు గూగుల్, ఫోన్, పేటీఎం వంటి వాటినే ఆశ్రయిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే షాపులో గల్లా పెట్టే ఖాళీగా ఉంటుంది. అలాగని వ్యాపారం జరగనట్టు కాదు. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తరువాత వ్యాపారాలు సులభమయ్యాయి. అటు అమ్మిన వారికి..ఇటు కొనుగోలు చేసిన వారికి ఇదో సులభతర మార్గమైంది.ఇక నుంచి అలా కుదరని తెలియడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. అటు కొనుగోలుదారుడు, ఇటు విక్రయదారుడిపై పన్ను వసూలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపో మాపో దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎంతెంత వసూలు చేయాలన్న దానిపై ఆర్థిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అయితే అమ్మేవాడి కంటే కొనుగోలుదారుడిపైనే భారం మోపేలా చార్జీ వసూలు విధానం ఉంటుందని తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే మాత్రం డిజిటల్ చెల్లింపులు తగ్గుముఖం పట్టే అవకాశమైతే ఉంది.
ప్రభుత్వ లాభాపేక్ష..
టెక్నాలజీ మారుతోంది. మనిషిని మరింత తేలిక చేస్తోంది. కానీ దీని వెనుక మాత్రం ఆర్థిక లాభాలను ప్రభుత్వం చూసుకుంటోంది. ఇందులో ప్రభుత్వాలను నిందించినా ఫలితముండదు. ఇష్టం ఉంటే చేసుకోండి.. లేకుంటే మానుకోండి అన్న సమాధానం తప్పిస్తే ఏమీ ఉండదు. డిజిటల్ మాటున ఉదయం దైనందిన జీవితం ప్రారంబించిన నాటి నుంచి రాత్రి పడుకునే వరకూ మనిషి చేసే ప్రతీ లావాదేవీలోనూ ప్రభుత్వం లాభాపేక్ష చూసుకుంటోంది. తొలుత సౌకర్యమన్న పదం వినియోగిస్తోంది. తరువాత తప్పనిసరి చేస్తోంది. తీరా అలవాటు పడాక ప్రతాపం చూపుతోంది. ఎంత భారమైనా అలవాటు పడిన శరీరాలు కనుక తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలకు తలవొంచాల్సిందే..