Tata Motors: భారత మార్కెట్‌లో టాప్ పొజిషన్ ఉన్న టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం, జూన్ 17న మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. కెనడాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా యూకే, యునైటెడ్ స్టేట్స్ మధ్య అర్ధరాత్రి ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం కుదరడమే దీనికి ప్రధాన కారణం. అంతకుముందు సోమవారం టాటా మోటార్స్ షేర్లు నిఫ్టీ 50 సూచీలో టాప్ లూజర్‌లలో ఒకటిగా నిలిచాయి. దీనికి కారణం, వారి యూకే యూనిట్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాస్త నిరాశాజనకమైన అంచనాలను ప్రకటించడమే.
యూకే, అమెరికా మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. యూకే నుండి అమెరికాకు ఎగుమతయ్యే ఆటోమొబైల్స్‌పై విధించే సుంకాలు తగ్గనున్నాయి. ఈ నెలాఖరు నుండి వార్షిక కోటా 1,00,000 వాహనాలకు గాను, అమెరికా సుంకాలు 27.5శాతం నుండి 10శాతానికి తగ్గుతాయి. ఇతర ఉత్పత్తులు, 25శాతం సుంకం లేకుండా అమెరికాలోకి ప్రవేశించడానికి సంబంధించిన జాబితా తర్వాత నిర్ణయించబడుతుంది.
గతంలో ప్యాసింజర్ వెహికల్స్ పై అమెరికా విధించే దిగుమతి సుంకం కేవలం 2.5శాతం ఉండేది. ఇప్పుడు కొత్తగా 10శాతం సుంకం తగ్గింది. దీని అర్థం, జేఎల్‌ఆర్ వంటి కంపెనీలకు పూర్తిగా పాత పరిస్థితి తిరిగి రాలేదు. కాకపోతే కాస్త ఉపశమనం మాత్రం దొరికిందని చెప్పొచ్చు.
సోమవారం టాటా మోటార్స్ షేర్లు 3.8శాతం తగ్గి రూ.685 వద్ద ముగిశాయి. దీనికి ప్రధాన కారణం జేఎల్‌ఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ నిర్వహణ లాభ మార్జిన్ అంచనాలను తగ్గించడమే. గతంలో 10శాతం అంచనా వేయగా, ఇప్పుడు దానిని 5-7శాతం మధ్య ఉంటుందని ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా సుంకాలు, చైనా మార్కెట్‌లో మందగమనం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అధిక పెట్టుబడులు వంటివి లాభాలపై ప్రభావం చూపుతాయని జేఎల్‌ఆర్ పేర్కొంది. అంతేకాదు, ఎఫ్‌వై26లో తమ ఫ్రీ క్యాష్ ఫ్లో దాదాపు సున్నాకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది.
సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్ సంస్థ టాటా మోటార్స్‌పై ఔట్‌పర్ఫామ్ రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.805గా నిర్ణయించింది. జెఫరీస్ టాటా మోటార్స్‌పై అండర్‌పర్ఫామ్ రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.600కి తగ్గించింది. యూకే-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల జేఎల్‌ఆర్ కు కొంత మేర సుంకాల్లో ఉపశమనం లభించినప్పటికీ, జేఎల్‌ఆర్ ఇచ్చిన నిరాశాజనకమైన అంచనాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు టాటా మోటార్స్ షేర్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.