Apple iPhone 14: మార్కెట్లో ఎన్ని మోడళ్ళు ఉన్నా యాపిల్ రేంజే వేరు. అది ఆవిష్కరించే ఫోన్ కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. డిజైన్ దగ్గర్నుంచి మొదలు పెడితే ఫీచర్ల వరకు ఎక్కడా యాపిల్ రాజీపడదు. అందుకే ఈ యాపిల్ కంపెనీ ఉత్పత్తులంటే జనం చెవులు కోసుకుంటారు. అంతటి నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేస్తుంది కాబట్టే యాపిల్ కంపెనీ ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీగా వినతి కెక్కింది.
ఐఫోన్ 14 విడుదల
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ బుధవారం నాడు ఐఫోన్ 14 సిరీస్ మోడళ్ళను ఆవిష్కరించింది. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మొత్తం నాలుగు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 5జి ఆధారిత కనెక్టివిటీ, ఈ_ సిమ్, క్రాస్ డిటెక్షన్, నెట్వర్క్ కనెక్టివిటీ లేని చోట సాటిలైట్ ఎమర్జెన్సీ ఎస్ ఓ ఎస్ సర్వీస్ ( తొలుత అమెరికా, కెనడాలోనే.. రెండేళ్లపాటు ఉచిత సేవ) వంటి అధునాతన ఫీచర్లతో ఈ మోడళ్ళను డిజైన్ చేశారు. ప్రో సిరీస్ వేరియంట్లను మాత్రం ఏ 15 బయోనిక్ చిప్ లతో డిజైన్ చేశారు. ప్రో సిరీస్ వేరియంట్లని మాత్రం ఆధునిక ఏ 16 బయోనిక్ చిప్ తో అందుబాటులోకి తెస్తున్నట్టు యాపిల్ కంపెనీ తెలిపింది.
ఫీచర్లు ఇలా
ఐఫోన్ 14 డిస్ప్లే 6.1 ఇంచులు, ఐఫోన్ 14 ప్రో డిస్ప్లే 6.1 ఇంచులు, 14 ప్రో మాక్స్ 6.7 ఇంచులు, ఐఫోన్ 14 ప్లస్ 6.7 ఇంచులు. వీటిలో బయానిక్ చిప్ సెట్ ను ఏ 15, ఏ 16 రకాల ను వాడింది. మెయిన్ కెమెరా విషయానికొస్తే ఐఫోన్ 14 లో 12 మెగాపిక్సల్, 14 ప్రో లో 48 మెగాపిక్సల్, 14 ప్రో మ్యాక్స్ లో 48 మెగాపిక్సల్, ఐఫోన్ 14 ప్లస్ లో 12 మెగాపిక్సల్ కెమెరాలను వాడింది.
స్మార్ట్ వాచ్ సిరీస్ కూడా
కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా యా వాచ్ 8 సిరీస్ పేరుతో స్మార్ట్ వాచ్ 8 సిరీస్ ని ఆవిష్కరించింది. ఈసీజీ సెన్సర్, బాడీ టెంపరేచర్ సెన్సర్, వెహికల్ క్రాష్ సెన్సర్, మహిళల రుతుక్రమంపై కచ్చితమైన సమాచారం అందించడంతోపాటు మరిన్ని అత్యధిక ఫీచర్లతో కూడిన ఈ వాచ్ ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 36 గంటల పాటు పనిచేయగలదు. ఇంటర్నేషనల్ రోమింగ్ కు కూడా సపోర్ట్ చేయగలదు. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. జిపిఎస్ వేరియేట్ ధర 399 డాలర్లు కాగా.. జిపిఎస్ ప్లస్ సెల్యులర్ వేరియంట్ ధర 499 డాలర్లు. భారతదేశంలో ప్రారంభ ధరను 45,990 గా నిర్ణయించారు. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ కావడంతో భారత్ లో బుధవారం నుంచే బుకింగ్స్ ను యాపిల్ ప్రారంభించింది. ఈనెల 16 నుంచి వినియోగదారులకు ఉత్పత్తులను అందజేస్తారు. ఇంతే కాకుండా వాచ్ ఎస్ ఈ 2 ( జిపిఎస్ వెర్షన్ 249 డాలర్లు, సెల్యులార్ వెర్షన్ 299 డాలర్లు) ను సైతం అందుబాటులోకి తెచ్చింది. అలాగే యాపిల్ వాచ్ ఆల్ట్రా మోడల్ ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 799 డాలర్లుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ బుధవారం నుంచే కంపెనీ ప్రారంభించింది. 23 నుంచి విక్రయాలు మొదలవుతాయి. అల్ట్రా వాచ్ భారత్ లో 89,900 కు లభించనుంది.
ఎయిర్ పాడ్ విభాగంలోనూ..
యాపిల్ రెండో తరం ఎయిర్ పాడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, టచ్ కంట్రోల్, స్పాషియల్ ఆడియో వంటి ఆధునిక ఫీచర్లతో డిజైన్ చేసింది. ఒకసారి చార్జ్ చేస్తే 30 గంటల వరకు పనిచేస్తుంది. దీని ధర 249 డాలర్లు. భారతదేశంలో 26,990 కి లభిస్తుంది. ఈ నెల 9 నుంచి బుకింగ్స్ మొదలవుతాయి.
సాంసంగ్, వన్ ప్లస్ ను దెబ్బకొట్టేందుకే
మార్కెట్లో మిడిల్ క్లాస్ కస్టమర్లకు సాంసంగ్ బాగా చేరువైంది. ఇప్పటికీ తాను ఆవిష్కరిస్తున్న మోడళ్ళను వారిని దృష్టిలో పెట్టుకునే చేస్తోంది. ఇక వన్ ప్లస్ కూడా అదే దారిలో ఉంది. భారత్ లాంటి పెద్ద మార్కెట్లలో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలదే హవా. యాపిల్ మాత్రం ఉన్నత శ్రేణి వర్గాలకు మాత్రమే చేరువైంది. ధర ఎక్కువగా ఉండటం, పైగా ఏవైనా మరమ్మతులు వస్తే ఇబ్బంది పడాల్సి రావటం లాంటి కారణాలతో వినియోగదారులు యాపిల్ పై అంత మక్కువ చూపడం లేదు. అయితే ప్రస్తుతం భారతదేశంలో త్వరలో 5జి సేవలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండటంతో యాపిల్ కంపెనీ ముందుగానే ఆధ్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం సాంసంగ్, వన్ ప్లస్ కంపెనీలను దెబ్బకొట్టేందుకే నాలుగు సీరీస్ లను విడుదల చేసింది.
Also Read:Different Fathers : కవలలు… తల్లి ఒకరే గానీ, తండ్రులు వేరు. ; ఈ వింత ఎలా సాధ్యమైంది!