https://oktelugu.com/

AI Technology : మీ పనులు చేసి పెడుతుంది.. మీ ఇంటి గోడలను వెలిగిస్తుంది

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు సమూల మార్పులకు గురవుతోంది. వినూత్నమైన ఆవిష్కరణలు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. అంతేకాదు మనుషుల జీవితాన్ని మరింత సుఖమయం చేస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 13, 2024 / 08:29 AM IST

    AI Technology

    Follow us on

    AI Technology : కొత్తకు చింత.. పాత ఒక రోత.. మిగతా విషయాల్లో ఏమో తెలియదు గాని.. సాంకేతిక ప్రపంచానికి పై సామెత అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన మార్పులకు గురవుతున్న నేపథ్యంలో.. కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ప్రముఖమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. దాన్ని తెలుగులో కృత్రిమ మేధ అని పిలుస్తున్నారు. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అని రంగాలలో దీనిని అనుసంధానించే పనులు ఊపందుకున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి చేపట్టే ఆవిష్కరణల్లో ఇప్పుడు కొత్త కోణం అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. పెను సంచలనాలు చోటుచేసుకుంటాయి.

    గోడలను వెలిగిస్తుంది

    చీకటి పడితే మీ ఇంట్లో కాంతి కోసం బల్బులను వేసుకుంటున్నారా.. అయితే ఇకపై ఆ పని చేయకండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన గోడలను వెలిగించుకోవచ్చు. తక్కువ ఇంధనం తో పనిచేసే పరికరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానిస్తే అవి వెలిగిపోతాయి.. అక్కడక్కడ ఏర్పాటు చేసే సెన్సార్లు ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానించిన రోబోలు.. ఎలాంటి పనినైనా చేసిపెడతాయి. ఇదంతా చదువుతుంటే విఠలాచార్య సినిమా గుర్తుకు వస్తోంది కదూ.. కానీ ఇవన్నీ త్వరలో జరుగుతాయి. వాస్తవానికి ఇప్పటికే చాలా వరకు ఇళ్లల్లోకి ఐ ఓ టి ఆధారిత గాడ్జెట్ లు చొచ్చుకు వచ్చాయి. ఐఓటి ఆదారిత సాకెట్ లతో ఫోన్ లోని యాప్ ల ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించొచ్చు.. అంతేకాదు ఇల్లు మొత్తాన్ని ఇంటర్నెట్ తో అనుసంధానించవచ్చు. అయితే వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలాంటి సౌకర్యాలను అందించే పరికరాలను తయారు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలలో స్మార్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ “రూమ్ బా” అందుబాటులోకి వచ్చింది. ఇక “ఐపో” అనే కంపెనీ రోబో కుక్కలను రూపొందిస్తోంది. ఓరి లివింగ్ అనే సంస్థ సోఫాలు, కుర్చీలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. రోబోటిక్ ఫర్నిచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. న్విడియా అనే కంపెనీ వంట చేసే రోబోటిక్ చేతుల కోసం ప్రయోగాలు చేస్తోంది.

    జాగ్రత్తగా ఉండాల్సిందే

    అయితే ఇలాంటి స్మార్ట్ పరికరాలను వాడుతున్నప్పుడు.. సైబర్ సెక్యూరిటీ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. కెమెరాలు, సెన్సార్లు వాడుతున్నప్పుడు హ్యాకర్లు అందులోకి ప్రవేశించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. పైగా సెన్సార్లలో రికార్డు అయ్యే సమాచారాన్ని కాపాడుకోవడం ఒక సవాల్. స్మార్ట్ ఇళ్లకు సంబంధించిన సక్సెస్ మొత్తం.. ఆ గాడ్జెట్లు తయారుచేసే కంపెనీల బట్టి ఉంటుంది. మరీ ముఖ్యంగా సైబర్ భద్రతకు వారు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది.