Flight Journey : మీరు తరచూ విమానంలో ప్రయాణిస్తారా.. అయితే ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఎప్పుడైనా గమనించారా?

ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది విమానయానానికి ఓటు వేస్తున్నారు. రోడ్డుమీద గంటల తరబడి ప్రయాణించడం కంటే.. గాల్లో తేలిపోతూ వెళ్లిపోవడం ఉత్తమం అని భావిస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : September 14, 2024 5:20 pm

Flight Journey 

Follow us on

Flight Journey : విమాన ప్రయాణం ప్రస్తుత కాలంలో సాధారణమైన అంశంగా మారిపోయింది. 2000 పెడితే చాలు విమాన ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే స్థాయి దాకా వచ్చింది. సాధారణంగా విమానాల్లో ప్రవేశ ద్వారాలు ఎడమవైపు ఉంటాయి. తరచుగా విమాన ప్రయాణం చేసేవారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.. ఎందుకంటే విమానం ఎక్కే హడావిడిలో వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోరు. అయితే ఇందులో చాలామందికి దాని వెనుక ఉన్న అసలు చరిత్ర తెలియదు. దీనిని విమానయాన నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. టిక్ టాక్ లో యాక్టివ్ గా ఉండే డగిషర్ఫీ అనే యువకుడు ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశాడు. విమానాలకు ఎంట్రీ డోర్లు ఎడమవైపు ఎందుకు ఉంటాయో వివరించాడు.

విమానాలు అందుబాటులోకి రానప్పుడు..

విమానాలు అందుబాటులోకి రానప్పుడు పూర్వపు కాలంలో ప్రజలు ఎక్కువగా నౌకల మీద సుదూర ప్రయాణాలు చేసే వాళ్ళు. ఆ రోజుల్లో నౌకల నుంచి సరుకులు, మనుషులు దిగడానికి వాటి ఎడమవైపు తలుపులను ఏర్పాటు చేసేవారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నౌకాయానం వర్ధిల్లింది. ఇదే క్రమంలో ఇదే సాంప్రదాయాన్ని అన్ని దేశాలు అనుసరించడం మొదలుపెట్టాయి. ఫలితంగా నౌకకు ఎడమవైపు భాగానికి పోర్టు సైడ్ అనే పేరు ముద్ర పడిపోయింది. పోర్టు సైడు అంటే నౌకాశ్రయానికి దగ్గరగా ఉండే వైపు అని దానికి అర్థం. నౌకలలో స్టీరింగ్ వీల్ ను కుడివైపు కమర్చడం వల్ల దానికి స్టార్ బోర్డ్ అనే పేరు వచ్చింది. విమానాలను కనుక్కున్న తర్వాత.. అవి ప్రయాణానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. విమానయాన నిపుణులు నౌకల్లో పాటించిన విధానాలను అనుసరించాలని ఒక అంగీకారానికి వచ్చారు. అందువల్లే ఎటువంటి ఇబ్బందికి వీలు లేకుండా ఒకే రకమైన ప్రామాణిక పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేసినట్టవుతుందని భావించడం మొదలుపెట్టారు. దీంతో నౌకలలాగే విమానాల్లోనూ ఎడమవైపు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎడమవైపు నుంచి దిగడానికి వీలుగా ప్రతి విమానాశ్రయంలో, విమానంలో ఏర్పాట్లు ఉంటాయి. ఇది నౌకల ద్వారా స్వీకరించిన విధానమని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు విమానానికి సంబంధించిన కాక్ పీట్, డ్యూయల్ ఇంజన్లు.. ఫ్యూయల్ పాయింట్.. సీట్ల అమరిక.. ఇతర ఏర్పాట్లు నౌకారంగం నుంచి స్వీకరించిందే. విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులను కాపాడటం.. పారా చూట్ల ఏర్పాటు.. ఆపత్కాలంలో మోగించే ప్రమాద హెచ్చరికల అమరిక.. వంటివి కూడా నౌకాయానం నుంచి స్వీకరించినవేనని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా, విమానాలలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు.. అధునాతన సౌకర్యాలను విమానయాన తయారీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ఒకప్పుడు విమాన ప్రయాణం సాదాసీదాగా ఉండేది. కానీ నేడు అధునాతన సౌకర్యాలతో అలరారుతోంది. విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. అందువల్లే విమాన ప్రయాణం చేయడానికి ఎవరూ వెనుకాడటం లేదు. పైగా బిజినెస్ క్లాస్ కంటే ఎకనామీకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఖర్చు ఏమాత్రమైనా వెనుకంజ వేయకుండా గగన వీధిలో అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు.