Himalayas : ఎండలు దంచి కొడుతున్నాయి. అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కేవలం వేసవికాలం మాత్రమే కాదు, వానా కాలంలోనూ కొద్దిరోజులు మినహా అన్ని రోజులు ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం పెరుగుతున్న భూతాపం. ఈ భూతాపం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయట. ఇది ఎప్పటినుంచో మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో హిమాలయాలు కరిగిపోవడం తీవ్రతరమైంది. ఫలితంగా కొత్త కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఉన్న సరస్సులు మరింత విస్తరించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.
గత 39 సంవత్సరాల నుంచి భూమ్మీద విపరీతంగా సరస్సులు విస్తరిస్తున్నాయి. ఇస్రో ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికకు ఇస్రో “శాటిలైట్ ఇన్ సైట్స్.. భారత హిమాలయాల్లో విస్తరిస్తున్న సరస్సులు” అని పేరు పెట్టింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి 2,431 సరస్సులు గుర్తించింది. ఇందులో 601 సరస్సులు రెండు రెట్ల కంటే ఎక్కువ విస్తరించాయి. పది సరస్సులు పరిమాణం కంటే ఒకటిన్నర నుంచి రెండు రెట్లు పెరిగాయి. 65 సరస్సులు ఒకటిన్నర రెట్లు విస్తరించాయి. గత 38 ఏళ్లలో వీటి పరిమాణం రెట్టింపయింది.. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించే దీర్ఘకాలిక ఉపగ్రహాలు తీసిన ఫోటోల ద్వారా ఇస్రో ఈ నివేదిక వెలువరించింది.
హిమాలయ పర్వతాల్లో 2,431 సరస్సుల్లో.. పదిహేటార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే 676 సరస్సులు భారీ స్థాయిలో విస్తరించాయి. ఇందులో 130 సరస్సులు భారతదేశంలోనే ఉన్నాయి. సింధు నది పరివాహక ప్రాంతంలో 65, గంగా నది పరివాహక ప్రాంతంలో ఏడు, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో 58 సరస్సులున్నాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో 314 సరస్సులు నాలుగువేల నుంచి 5000 మీటర్ల పరిధిలో ఉన్నాయి. 296 సరస్సులు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 4,068 మీటర్ల ఎత్తు ఉండే గేపాంగ్ ఘాట్ గ్లేసియల్ సరస్సు అనేక మార్పులకు గురైంది. ఇది 178% విస్తరించింది. సంవత్సరానికి దీని పెరుగుదల 1.96 హెక్టార్లుగా ఉంది.
హిమాలయ పర్వతాలు కరగడం వల్ల ఏర్పడిన సరస్సులు మంచినీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచి వెనుక చెడు ఉన్నట్టు ఇవి ” గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్” వంటి ప్రమాదాలకు కారణమవుతాయి. పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురువక పోయినప్పటికీ ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. మామూలు వర్షాలు కురిసినా తీవ్రమైన వరదలు సంభవిస్తాయి. దీనంతటికీ పారిశ్రామిక విధానాలు, పెరిగిపోతున్న కాలుష్యం, చెట్లను నరకడమే ప్రధాన కారణాలని ఇస్రో చెబుతోంది.