Elon Musk Twitter : ట్విట్టర్ తో అంత ఈజీ కాదు: ఎలాన్ మస్క్ కు క్రొకోడైల్ ఫెస్టివలే

Elon Musk has trouble with Twitter : ముందు కొంటా అన్నాడు. తర్వాత వద్దు అనుకున్నాడు. నేను పిరికివాన్ని కాదని ప్రకటించుకున్నాడు. తర్వాత నేను తప్ప ఎవరూ దిక్కులేరు అని వ్యాఖ్యానించాడు. బుర్రలో ఏ పురుగు తొలిచిందో ఏమో కానీ అనేక శషబిషల తర్వాత ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ కు చుక్కలు చూపిస్తోంది. 4400 కోట్ల డాలర్ల ఈ భారీ టేక్ ఓవర్ అతడి వ్యక్తిగత సంపదకు […]

Written By: Bhaskar, Updated On : October 30, 2022 2:21 pm
Follow us on

Elon Musk has trouble with Twitter : ముందు కొంటా అన్నాడు. తర్వాత వద్దు అనుకున్నాడు. నేను పిరికివాన్ని కాదని ప్రకటించుకున్నాడు. తర్వాత నేను తప్ప ఎవరూ దిక్కులేరు అని వ్యాఖ్యానించాడు. బుర్రలో ఏ పురుగు తొలిచిందో ఏమో కానీ అనేక శషబిషల తర్వాత ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ కు చుక్కలు చూపిస్తోంది. 4400 కోట్ల డాలర్ల ఈ భారీ టేక్ ఓవర్ అతడి వ్యక్తిగత సంపదకు గుదిబండలా మారింది. శుక్రవారం ట్విట్టర్ మస్క్ చేతికి వచ్చిన వెంటనే ఆయన ఆస్తుల విలువ ( నెట్ వర్త్) హారతి కర్పూరంలా 1000 కోట్ల డాలర్లు ( సుమారు 82,480 కోట్లు) కరిగిపోయింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. నిజానికి ఒక దశలో ట్విట్టర్ డీల్ కు ఏదో ఒకలా గుడ్ బై చెప్పాలి అని మస్క్ అనుకున్నారు. బోగస్ ఖాతాల పేరుతో డీల్ కు గుడ్ బై చెప్పాలని చూశాడు. ట్విట్టర్ ఈ విషయాన్ని కోర్టుకు ఈడ్చి నానా రచ్చ చేయడంతో మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్నీ సమస్యలే

ఒక్కో షేర్ 54.2 డాలర్ల చొప్పున ట్విట్టర్ ను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్టు ఎలాన్ మస్క్ గత ఏప్రిల్ మాసంలో ప్రకటించారు. ఆదాయం పడిపోతున్న ట్విట్టర్ కు ఇంత ధరా అని వాల్ స్ట్రీట్ ఆశ్చర్యపోయింది. మస్క్ కు మతి భ్రమించిందని కార్పొరేట్లు వ్యాఖ్యానించారు. టెస్లా ఈక్విటీలో తన వాటా షేర్లలో కొంత భాగం అమ్మి ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధులు సమీకరిస్తారని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి. దెబ్బకు టెస్లా షేర్లకూ గ్రహణం పట్టింది. ఈ ఏడాది గరిష్ట స్థాయితో పోలిస్తే టెస్లా షేర్లు ఇప్పటికీ 35 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నష్టాన్ని కూడా కలుపుకుంటే ఈ సంవత్సరం మస్క్ వ్యక్తిగత సంపద విలువ ఏకంగా 6,600 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. మునుముందు ఈ నష్టం తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందని వాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ప్రపంచ శ్రీమంతుడుగా మరో కొత్త వ్యక్తి వెలుగులోకి వస్తాడని వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవేళ జరగరానిది జరిగితే దాని ప్రపంచ శ్రీమంతుడుగా అదానీ అవుతాడని లెక్కలు వేస్తున్నాయి.
ఇక ట్విట్టర్ కొనుగోలు మస్క్ కు నష్టం తీసుకొచ్చినా ఆ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ గద్దె విజయలకు మాత్రం మేలు చేసింది. ఎప్పుడైతే ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చిందో.. అప్పుడే మస్క్ వారిద్దరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో వారికి నష్టపరిహారంగా 12 కోట్ల డాలర్లు ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే 1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.. ఇందులో 6.7 కోట్ల డాలర్లు అగర్వాల్ కు, 5.47 కోట్ల డాలర్లు గద్దె విజయకు అందుతాయని వాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా తమను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత అటు పరాగ్ అగర్వాల్ కానీ, ఇటు గద్దె విజయ కానీ ఎటువంటి మాట మాట్లాడకపోవడం గమనార్హం.