https://oktelugu.com/

Maharastra – Sangli District : మొబైల్‌ వాడకం తగ్గించిన మారుమూల పల్లె.. అందుకు ఏం చేసిందో తెలుసా..!? 

డిజిటల్‌ డీటాక్స్‌ అమలు తర్వాత పిల్లల్లో చాలా మార్పు వచ్చిందంటున్నారు మొహిత్యాచి వడ్గావ్‌ గ్రామస్తులు. పిల్లలు సొంతంగా ఆలోచించగలుగుతున్నారని, సెన్స్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ అవేర్‌నెస్‌ పెరిగిందని అంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 16, 2023 / 05:47 PM IST
    Follow us on

    Maharastra – Sangli District : అది ఓ మారుమూల పల్లె.. అయితేనేం పట్టణంలో ఉన్నట్లే అక్కడా మొబైళ్లు ఉన్నాయి… అక్కడా ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్‌ వినియోగం తక్కువే. ఎందుకంటే.. వ్యవసాయం, ఇతర కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారికి ఫోన్‌తో కాలక్షేపం చేసే తీరిక దొరకదు. పనిలో నిమగ్నమయ్యాక ఫోన్‌పై ధ్యాసే ఉండదు. కానీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేటితరం మాత్రం అలా కాదు.. టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్లకు బానిసవుతోంది. పట్టణం, గ్రామం అని తేడా లేకుండా మొబైల్‌ ఫోన్లలో ముగినితేలుతోంది. తమ పిల్లల్లో ఈ పరిస్థితిని గమనించిన ఆ మారుమూల పల్లె ప్రజలు ఓ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన ఫోన్లకు దూరంగా ఉంచేందుకు ఓ ఉపాయం చేశారు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఇంతకి ఆ పల్లె ఎక్కడుంది.. వారు ఏం చేశారు.. పిల్లల్లో ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకుందాం…

    మహారాష్ట్రలో.. 
    మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మొహిత్యాచి వడ్గావ్‌ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత పల్లె. వ్యవసాయం, కూలీనాలి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందరు తల్లిదండ్రుల్లాగే తమ పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే కరోనా కారణంగా దేశంలో అందరు విద్యార్థులు ఇబ్బంది పడినట్లే మొహిత్యాచి వడ్గావ్‌ గ్రామానికి చెందిన పిల్లలూ చదువులకు ఇబ్బంది పడ్డారు. పాఠశాలలు మూసివేయడం, ఆన్‌లైన్‌ క్లాసులు బోధించడంతో మొబైల్‌ ఫోన్లకు అలవాటయ్యారు. దీంతో కరోనా తర్వాత కూడా ఫోన్లు చూడడానికే పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలంతా సోమరులుగా తయారయ్యారని టీచల్లు కూడా గుర్తించారు. ఇందుకు ఫోన్లే కారణమని సర్పంచ్‌కు చెప్పారు.
    శారీరక, మానసిక సమస్యలు.. 
    గంటల తరబడి ఫోన్లు చూడడం వలన పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్‌ పిల్లల్లో ఆలోచనా శక్తిని నశింప జేస్తుందని, సృజనాత్మకతను దెబ్బతీస్తుందని తల్లిదండ్రులు కూడా గుర్తించారు. పిల్లలతోపాటు పెద్దలు ఫోన్‌ కారణంగా బంధాలు, అనుబంధాలకు తూరమవుతున్నామని ఫీల్‌ అయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పిల్లల భవిష్యత్‌ అంధకారమవుతుందని ఆందోళన చెందారు.
    డిజిటల్‌ డీటాక్స్‌ అమలు..
    పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారిని ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉంచాలనుకున్నారు. ఇందుకోసం ఊరంతా ఏకతాటిపైకి వచ్చింది. సర్పంచ్‌తో చర్చించింది. పిల్లల కోసం డిజిటల్‌ డీటాక్స్‌ అమలు చేయాలని నిర్ణయించారు. రోజులో కొంత సమయమైనా పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావించారు. పొద్దంతా పెద్దలు పనులకు వెళ్తారు.. పిల్లలు విద్యాలయాలకు వెళ్తారు కాబట్టి రాత్రివేళ డిజిటల్‌ డీటాక్స్‌ అమలుకు శ్రీకారం చుట్టారు.
    ప్రతీరోజు గంటన్నరపాటు.. 
    డిజిటల్‌ డీటాక్స్‌ అంటే.. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్, డిజిటల్‌ యంత్రాలకు దూరంగా ఉండడమే డిజిటల్‌ డీటాక్స్‌. మొహిత్యాచి వడ్గావ్‌ ప్రతీరోజు రాత్ర 7 నుంచి 8:30 గంటల వరకు డిజిటల్‌ డీటాక్స్‌ అమలు చేస్తున్నారు, ఇందుకోసం గ్రామంలో ప్రతీ రోజు రాత్రి 7 కాగానే ఒక సైరన్‌ వస్తుంది. అది రాగానే అందరూ పిల్లలు, పెద్దలు అంతా తమ చేతిలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు పక్కన పెట్టేస్తారు, టీవీలు ఆఫ్‌ చేస్తారు. ఎంత పని ఉన్నా.. ఎంత ముఖ్యమైన ఫోన్‌ వచ్చినా మాట్లాడరు. పిల్లలంతా పుస్తకాలు పట్టి చదువుకోవడం, హోంవర్క్‌ చేసుకోవడం చేస్తారు. ఇక పెద్దలంతా ఒకచోటకు చేరి ఆరోజు జరిగిన మంచి చెడు గురించి మాట్లాడుకుంటారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు.
    ఆరోగ్యంగా, ఉత్సాహంగా.. 
    డిజిటల్‌ డీటాక్స్‌ అమలు తర్వాత పిల్లల్లో చాలా మార్పు వచ్చిందంటున్నారు మొహిత్యాచి వడ్గావ్‌ గ్రామస్తులు. పిల్లలు సొంతంగా ఆలోచించగలుగుతున్నారని, సెన్స్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ అవేర్‌నెస్‌ పెరిగిందని అంటున్నారు. పెద్దలు, పిల్లల్లో సోషల్‌ ఇంట్రాక్షన్‌ కూడా పెరిగిందని చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు చక్కగా నిద్రపోతున్నారని కూడా అంటున్నారు. మానసికంగా, శారీరకంగా అనేక ప్రయోజనాలు డిజిటల్‌ డీటాక్స్‌తో కలిగాయని వివరిస్తున్నారు. ప్రతీ ఇల్లూ మొహిత్యాచి వడ్గావ్‌ గ్రామంలా మారితే.. డిజిటల్‌ డీటాక్స్‌ అమలు చేస్తే పిల్లలకు మంచి చేసినవారవుతారని, వారి భవిష్యత్‌ బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.