Artificial Intelligence : కృత్రిమ మేథ.. మనిషి రూపొందించిన అత్యద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్. మొన్నటిదాకా దీనిని అసాధ్యమైన పనులకు మాత్రమే వాడేవారు. పైగా ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం కాబట్టి.. అప్పట్లో అవసరం మేరకు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బైక్, ఫోన్, ఏసీ, కారు వంటివి లగ్జరీ స్థాయి నుంచి అన్ని నిత్యావసరంగా మారిపోయినట్టు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దినచర్యలో ఒక భాగం అయిపోయింది.
మొత్తం మార్చేస్తోంది
ఆ మధ్య ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో దేశంలోని పారిశ్రామికవేత్తల ఫోటోలను వివిధ రూపాల్లో రూపొందించాడు. ఒక్కసారి వాటిని చూడగానే నిజం అనిపించింది. అదే వ్యక్తి దేశంలో పేరు పొందిన క్రికెటర్లను అమ్మాయిలుగా రూపొందించి నిజమే అనే భ్రమ కలిగించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే డీప్ ఫేకింగ్ దాకా వచ్చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానం.. మనిషి జీవితంలో ఇంకా ఎన్ని మార్పులు తీసుకొస్తుందో?
చిన్నపాటి సంస్థ: బోటాబోటి లాభాలు
చిన్నపాటి సంస్థలకు అంతగా లాభాలు రావు. లాభాలు రావు కాబట్టి పెద్దగా ఉద్యోగులు కూడా ఉండరు. వచ్చేవి అంతంత మాత్రమే లాభాలు కాబట్టి ఉద్యోగులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటారు. నెలాఖరు నాటికి అన్ని లెక్కలు తీసేస్తే ఎంతో కొంత మిగులుతాయి. నిర్వాహకులకు కొద్దో గొప్పో వెసలుబాటు లభిస్తుంది.. కానీ ఆ ఉద్యోగులను కూడా తొలగించి.. ట్రైనీ లతో కార్యాలయ నిర్వహణ సాగిస్తే చాలా మొత్తం మిగులుతుంది కదా! కానీ నైపుణ్యం ఉన్న వాళ్ళలాగా వీరు పని చేయగలుగుతారా? ఇలాంటి ఆలోచన ఉన్న ఆ కార్యాలయల నిర్వాహకులకు గొప్ప ఐడియా తట్టింది. తమ కార్యాలయాల అవసరాల మొత్తం తీర్చగలిగే ఒక సాఫ్ట్వేర్ వాళ్ల చేతికి వచ్చింది. కేవలం నెలకు వందల్లో ఖర్చు చేస్తే చాలు మెయిల్ నుంచి బ్లాక్ వరకు సోషల్ మీడియాకు అవసరమైన రాతలు మొత్తం రాసేస్తుంది. వాటిలో దోషాలు లేకుండా చూసుకొని సరి చేసుకుంటే చాలు.. ముగ్గురు నలుగురు సీనియర్ ఉద్యోగులు చేసే పని మొత్తం ఆ సాఫ్ట్వేర్ చేస్తుంది. చేస్తుందేంటి ఆల్ రెడీ చేస్తోంది కూడా.. దీంతో ఆ కార్యాలయాల నిర్వాహకులు ఉద్యోగులను రేపటి నుంచి రావద్దంటూ ఇంటికి సాగనంపారు. దీంతో ఆ ఉద్యోగులు కన్నీటిని తుడుచుకుంటూ ఇళ్లకు వెళ్లారు. ఈ సంఘటన కల్పితం కాదు. ఏదో సినిమా కోసం రూపొందించింది అంతకన్నా కాదు. ఇది చిన్న తరహా కార్యాలయాల్లో జరుగుతోంది.
బుద్ధి జీవి సరే.. మరి ఇందేంటి?
మనిషి ఎవరైనా తనకంటే మెరుగ్గా, తనకంటే వేగంగా, తనకంటే కచ్చితంగా, తనకంటే తెలివిగా పనిచేయగల సాంకేతికత కోసం ఆరాటపడతాడా? మోహిని భస్మాసుర కథ తెలిసిన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారాలకు నడుం బిగిస్తాడా? మేధ పరంగా తనతో సమానంగా పనిచేయగల యంత్రాల ఆవిష్కరణ గురించి మనిషి అనాదిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. విజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి ఆలోచనలు కొత్త కొత్త రూపాలవైపు వెళ్ళిపోతున్నాయి. అవి ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి. 1989లో రేడియోతనంగాలతో నియంత్రించగలిగే యంత్రాన్ని రూపొందించిన నికోలా టెస్లా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు. తర్వాత దిశలో మనిషితో సరి సమానంగా ఎత్తులేస్తూ విశ్వనాథన్ ఆనందు లాంటి దిగ్గజాలకే పెట్టగలిగే యంత్రాలు వచ్చాయంటే మామూలు విషయం కాదు. అలెన్ ట్యూరింగ్.. కంప్యూటర్లు అనేవి కేవలం సమాచారాన్ని తీసుకొని, వాటిని ప్రాసెస్ చేసి, ఫలితాన్ని అందించే యంత్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదనే లక్ష్యంతో ట్యూరింగ్ యంత్రాన్ని రూపొందించాడు. అలా వాటంతట అవే సమాచారాన్ని విశ్లేషించుకునే “మిషన్ లెర్నింగ్” మొదలైంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాల వేగం పుంజుకుంది. సంగీతం, రవాణా, ఉత్పత్తి.. ఇలా అన్ని రంగాల్లో వీటి ఉనికి కనిపించింది. చాట్ జిపిటి రాకతో ఒక్కసారిగా “మనిషి అవసరమే లేదు” అన్నంత స్థాయిలో కృత్రిమ మేధ ప్రాభవం మొదలైంది. పదునైన ఆయుధం లాంటి ఈ సాఫ్ట్వేర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..అన్ని భయాలూ కలవరపెడుతున్నాయి..
డీప్ ఫేకింగ్
ఇంతకుముందు ఫోటో లేదా వీడియోలో మొహాన్ని మార్చడం అసాధ్యం. అతుకు పెట్టినప్పటికీ ఆ తేడా తెలిసిపోయేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు అలా కాదు.. వాస్తవానికి దగ్గరగా కృత్రిమ సంఘటనలు కూడా సృష్టించవచ్చు. మనిషిని రకరకాలుగా మార్చి చూపించవచ్చు. కానీ ఇలాంటి సమయంలో నిజం నిగ్గు తేలేలోపు పరువు మంట కలిసిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కెరియర్లు సర్వనాశనం అయిపోతాయి.. నాలుగు డబ్బులు ఇస్తే చాలు డీప్ ఫేకింగ్ చేసి పెడతామని వెబ్సైట్లు కొట్టుకొస్తాయి. ఎన్ కోడర్స్ ప్రక్రియ ద్వారా రెండు చిత్రాల మధ్య సారూప్యతను క్షుణ్ణంగా గమనించి, పౌడర్స్ సాంకేతికతతో అటు ఇటుగా మార్చేస్తుంది. ఇక వీటికి జిపిఎన్ లాంటి సాంకేతికత జోడిస్తే మరింత సహజంగా మారుతుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలోకి అత్యంత వేగంగా చొచ్చుకు వచ్చింది. ముందు ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే ప్రమాదం పొంచే ఉంది.