BYJU’S: బైజూస్… ప్రఖ్యాతిగాంచిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ. 2011 లో స్వయం ఉపాధి పథకంగా ప్రారంభమై పదేళ్లలో విశేష ప్రాచుర్యం పొందింది. పదేళ్లలో 11 స్టార్టప్ కేంద్రాలను కొనుగోలుచేసి దేశంలోని ప్రముఖ కార్పొరేట్ ఆన్ లైన్ ట్యూషన్ టీచింగ్ సంస్థగా ఎదిగింది. ఇదే సంస్థతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెప్పించడంతో పాటు ల్యాప్ టాప్ లు అందించే బాధ్యత బైజూస్ సంస్థపై పెట్టింది. ప్రస్తుతం బైజూస్ కంపెనీ ఆర్థిక పరిస్థితిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బైజూస్ లో కొనుగోళ్ల రూపంలో భారీ గోల్ మాల్ జరిగిందని..పెట్టుబడుల సమీకరణలో అడ్డగోలు పనులకు తెరతీశారని జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇంతవరకూ బైజూస్ యాజమాన్యం స్పష్టతనివ్వడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దాదాపు రూ.6 వేల కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి గత సెప్టెంబరులో స్పష్టమైన ప్రకటన జారీచేసింది. కానీ కంపెనీ ఖాతాలో నిధులు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది తన తరువాత స్థానంలో ఉన్న ఆకాశ్ సంస్థను బైజూస్ టేకోవర్ చేసుకుంది. అయితే కుదుర్చుకున్న డీల్ షటిల్ చేయడంలో సతమతమవుతుంది. దీంతో ఒక్కో ఆర్థిక వ్యవహారం బయటపడుతూ వస్తోంది. ఫేక్ సంస్థల పేరు చెప్పి పెట్టుబడులు ఆహ్వానించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వచ్చిన నిధులు అంతర్జాతీయ ఖాతాలకు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి.
సింపుల్ గా ప్రారంభించి..
స్టార్టప్ ప్రపంచంలో బైజూస్ ప్రస్థానం ఇప్పటిది కాదు. చాలా సింపుల్ గా ప్రారంభమై వేల కోట్ల టర్నోవర్ తో ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందింది బైజూస్. చాలా వేగంగా విస్తరించింది. ఆన్ లైన్ ట్యూషన్ కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. అయితే ఎంతలా విస్తరించిందో.. అదే స్థాయిలో పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. యాజమాన్యం కంపెనీ విలువను పెంచుకునేందుకు పెట్టుబడుల లెక్కల్లో అడ్డగోలు వ్యవహారానికి తెరతీశారు. ఆ సంస్థకు విదేశాల నుంచి వివిధ సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల వరకూ పెట్టుబడులు వచ్చినట్టు చెప్పినా.. వాటి అడ్రస్ లేకుండా పోయింది. అసలు ఆ నిధులు ఏమయ్యాయి అన్నదానిపై ఇంతవరకూ స్పష్టత లేదు. పెట్టుబడులు రాకుండా వచ్చాయని చెప్పి కంపెనీ విలువ పెంచుకునేందుకు ప్రయత్నించారా? వచ్చిన నిధులు పక్కదారి పట్టించారా? అని గత రెండు రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి.
Also Read: My Village Show Gangavva: వామ్మో గంగవ్వ.. రేంజ్ మామూలుగా లేదుగా
ఆర్థిక సంక్షోభం..
బైజూస్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తమ స్టార్టప్ ను బలోపేతం చేసుకునేందుకు మరో 11 స్టార్టప్ లను కొనుగోలు చేసింది.వాటికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇంతలో ఆకాశ్ పేరుతో ఉన్న విద్యాసంస్థలను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వాటి చెల్లింపులు చేయడానికి యాజమాన్యం నానా తంటాలు పడుతోంది. ఆగస్టులోగా అమెరికా కు చెందిన బ్లాక్ స్టోన్ సంస్థకు 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఒక వైపు వచ్చిన పెట్టుబడులు చూస్తే కనిపించడం లేదు. చెల్లింపులు సైతం నిలిచిపోయాయి.
కొవిడ్ లో విశేష సేవలు..
కొవిడ్ సమయంలో బైజూస్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాని సేవలు విస్తరించాయి. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. అంతటా ఆన్ లైన్ తరగతులు నడిచాయి. దీంతో బైజూస్ గణనీయంగా విస్తరించింది. అన్నిరకాల విద్యాసేవలను, తరగతులను అందుబాటులో ఉంచింది. వేలాది మంది నిపుణులను నియమించుకుంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు బైజూస్ ను ఆశ్రయించారు. దీంతో వ్యాపారం గణనీయంగా పెరిగింది. ఈ దీమాతో యాజమాన్యం ఇతర స్టార్టప్ లను కొనుగోలుచేయడంతో పాటు తన తరువాత స్థానంలో ఉన్న ఆకాశ్ విద్యాసంస్థలను సైతం టేకోవర్ చేసుకుంది. అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టడం, ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం కావడంతో బైజూస్ వినియోగం తగ్గింది. దీంతో యాజమాన్యానికి లాభాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వేలాది మంది ఉద్యోగులను యాజమాన్యం తొలగించడం ప్రారంభించింది. ఇప్పుడు ఒప్పందం చేసుకున్న సంస్థలకు చెల్లింపులు నిలిచిపోవడంతో మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో బైజూస్ చరిత్ర మసకబారుతోంది.
Also Read:Blood Cancer Treatment: బ్లడ్ క్యాన్సర్ చికిత్స ఖర్చు అమెరికా కంటే మన దగ్గరే తక్కువ ఎందుకంటే