Artificial Trees : ఈ భూమ్మీద ఉన్న మొక్కలు.. చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరం. మొక్కలు, చెట్లు ఆక్సిజన్ అందిస్తాయి. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుంటాయి. ప్రాణకోటికి జీవాన్ని అందిస్తాయి. అందువల్లే చెట్లను ప్రాణదాతలు అని పిలుస్తుంటారు.. ఈ భూమి మీద మనిషి ఎన్నో సృష్టించాడు. మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించాడు. కానీ మొక్కలకు ప్రత్యామ్నాయంగా ఏదీ సృష్టించలేకపోయాడు. ఆవిష్కరించలేకపోయాడు. అయితే ఇకపై కృత్రిమ చెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవి వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి.. ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. పైగా ఈ కృత్రిమ చెట్లు నిజమైన చెట్ల కంటే వెయ్యిరెట్లు వేగంగా పనిచేస్తాయి. ఇవి ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి.
కృత్రిమ చెట్టును కొలంబియా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తోంది. కొద్దిరోజులుగా ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు విజయవంతమైనట్టు తెలుస్తోంది. మరి కొన్ని ప్రక్రియ తర్వాత ఈ చెట్లను ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యం వల్ల భూగోళంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల వల్ల ఆకాలమైన వర్షాలే కాదు.. ఊహించని ఎండలు.. అంచనా వేయలేని చలిగాలులు వీస్తున్నాయి. భౌగోళికంగా సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రపంచం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అతివృష్టి, అనావృష్టి వల్ల కోట్లాదిమంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఈ మార్పుల వల్ల ఏటా లక్షల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అభివృద్ధి పేరుతో జరుపుతున్న విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతోంది.
ఉదాహరణకు ఈ సంవత్సరాన్ని గనక తీసుకుంటే.. అకాలమైన వర్షాల వల్ల అమెరికా నుంచి మొదలుపెడితే భారత్ వరకు నష్టం విపరీతంగా చోటు చేసుకున్నది. వర్షాల వల్ల ప్రాంతాలకు ప్రాంతాలు నీటమునిగాయి. లక్షలాదిమంది ఆవాసాలను కోల్పోయారు. ఇక ఆస్తి నష్టమైతే వేలకోట్లల్లో జరిగి ఉంటుంది.. అయితే ఇటువంటి పరిణామాలను అడ్డుకోవాలంటే కృత్రిమ చెట్లే పరిష్కార మార్గమని పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది మొక్కలను పెంచడం కంటే చెట్లను నరకడమే అధికమవుతోంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న పర్యావరణ విధ్వంసం ఇష్టానుసారంగా సాగిపోతోంది. అందువల్లే ప్రపంచం ఈ స్థాయిలో పరిణామాలను ఎదుర్కొంటున్నది..
కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేసిన కృత్రిమ చెట్లు ఎలా పని చేస్తాయి? వీటికి విద్యుత్ అవసరం ఉంటుందా? సౌర శక్తి ద్వారా మాత్రమే పని చేస్తాయా? వీటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇవి ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తాయి? గ్రహించుకున్న కార్బన్ డై ఆక్సైడ్ ను ఏం చేస్తాయి? ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి చేస్తాయి? అనే ప్రశ్నలకు పరిశోధకులు సమాధానాలు చెప్పడం లేదు. బహుశా టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత ఈ వివరాలను పరిశోధకులు వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ కృత్రిమ చెట్లు అందుబాటులోకి వస్తే.. చెట్లను నరకడం మరింత పెరుగుతుందని తెలుస్తోంది. అప్పుడు భూ వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.