Apple : AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మెల్లమెల్లగా ప్రతి పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. రాబోయే కాలంలో దీని ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వినియోగదారుల మెరుగైన ఎక్స్ పీరియన్స్ కోసం AI ఫీచర్లను అందిస్తుండగా, మరోవైపు ఒక టైం వస్తుంది.. అప్పుడు ఫోన్ అవసరమే ఉండదని చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఆపిల్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్) ఎడ్డీ క్యూ స్మార్ట్‌ఫోన్‌ల భవిష్యత్తు గురించి ఒక సంచలన విషయం చెప్పాడు.
AIతో స్మార్ట్‌ఫోన్‌లకు రీప్లేస్మెంట్
ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఎడ్డీ క్యూ ప్రకారం.. AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తుంటే వచ్చే దశాబ్దంలో అంటే 10 సంవత్సరాలలో ఐఫోన్‌లు వాడుకలో ఉండవు. అంతేకాదు, 10 సంవత్సరాల తర్వాత మీకు ఐఫోన్ అవసరం కూడా ఉండదు. ఒక రోజు వస్తుందని అప్పుడు AI సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌లను రీప్లేస్ చేస్తుందని ఎడ్డీ క్యూ సూచన ఇచ్చారు.
యాపిల్ నెక్ట్స్ ప్లాన్ ఏంటంటే ?
కంపెనీ తన అత్యంత పాపులారిటీ సాధించిన ఉత్పత్తి ఐఫోన్‌ను నిలిపివేస్తే, అప్పుడు కంపెనీ ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఐఫోన్ తర్వాత కంపెనీ రోబోటిక్స్, వేరబుల్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఐఫోన్ కంపెనీ అత్యంత ప్రజాదరణ సాధించిన ఉత్పత్తి, ఇది కంపెనీ ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కంపెనీ ఐఫోన్ విజయాన్ని సరితూగే ఉత్పత్తిని ఇప్పటివరకు కనుగొనలేకపోయింది. ఆపిల్ కంపెనీ భవిష్యత్తులో AR స్మార్ట్ గ్లాసెస్‌పై వర్క్ చేయనుంది. వీటిని ఐఫోన్‌కు రీప్లేస్‌మెంట్‌గా విడుదల చేయవచ్చు.
ఆపిల్ వద్ద అనేక ఉత్పత్తులు లైన్‌లో ఉన్నాయి. కంపెనీ వినియోగదారుల కోసం కెమెరా-ఫేస్ ఐడి కటౌట్ లేని ఆల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, ఫోల్డబుల్ ఐఫోన్ వంటి కొత్త పరికరాలను తీసుకురావచ్చు. ఈ ఉత్పత్తులను 2026, 2027లో విడుదల చేసే అవకాశం ఉంది.