AP Fiber Net : టెక్నాలజీ అభివృద్ధి ప్రజలకు సేవలను రోజురోజూ మరింత చేరువ చేస్తోంది. ఇప్పటికే ఇటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఆధునిక సేవలను ఫైబర్‌నెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్‌లో చూసే అవకాశం కల్పిస్తుంది. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏప్రిల్ 7న లాంఛనంగా ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సర్వీసస్ సబ్ స్క్రైబ్ చేసుకొని ‘ఫస్ట్ డే ఫస్ట్ షో‘ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో చూడవచ్చు.
ట్రిపుల్ ప్లే సేవలు..
ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే ‘ట్రిపుల్ ప్లే‘ సేవలను (ఐపీ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్) అందించడం. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు మరియు ప్రభుత్వ సంస్థలకు ఇది మానవాభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ తన నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, నమ్మదగిన, మరియు అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తుంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో ఎన్నో మార్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
నేడు ప్రారంభం..
ఈ అత్యాధునిక ఫైబర్‌నెట్ సేవలను గురువారం ప్రారంభించనున్నారు. ప్రసాద్ ల్యాబ్ వేదికగా జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు.
ఇప్పటికే మూడు ప్లాన్స్..
ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ లిమిటెడ్ (ఏపీ ఫైబర్ నెట్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం హైస్పీడ్ ఇంటర్ నెట్ సేవలను అందించేందుకు జగన్ సర్కారు సంకల్పించింది. టీవీ సర్వీసుతో పాటు ఇంటర్నెట్‌ను వినూత్నంగా అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుడి ఇంటి వద్దే ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ ఐపీటీవీ, జీపీఓఎన్ బాక్స్ సహాయంతో నేరుగా టీవీలో వినియోగించే వెసలుబాటు కల్పిస్తోంది. అలాగే ఇంటర్నెట్ లీసెడ్ లైన్లు, ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్ బ్యాండ్, ఆడియో కాన్ఫరెన్స్ సేవలను రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అందిస్తోంది.
ఏపీ ఫైబర్ నెట్ ప్లాన్స్..
గృహ వినియోగదారుడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 300 నుంచి రూ. 599 వరకు ప్లాన్స్‌ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపార, కార్యాలయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.999 నుంచి రూ.2,499 ప్లాన్స్ తీసుకొచ్చింది. బేసిక్ ప్యాక్ రూ.300తో 200+ చానల్స్, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటా అందిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నడుస్తుంది. అలాగే ఎస్సెన్షియల్ ప్యాక్ జీఎస్టీతో కలిపి రూ. 449కు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 300 జీబీ, ప్రీమియం ప్యాక్ జీఎస్టీతో సహా రూ.599కు 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే అధిక టీవీ చానెళ్లు, అపరిమిత టెలిఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
50 లక్షల మందికి నెటర్క్ సేవలు..
స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం ద్వారా గృహాలకు ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ సేవలను అందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో 50 లక్షల గృహాలకు ఫైబర్ నెట్‌వర్క్ సేవలు అందించే దిశగా ముందుకు సాగుతోంది. క్రమేపీ పెరుగుతున్న చందాదారుల సంఖ్యకు తదనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యానికి తగినట్లుగా సీపీఈ బాక్సుల సరఫరాను పెంచే యోచనలో ఉంది.