Spam Calls: పెరుగుట విరుగట కొరకే అంటారు పెద్దలు.. ప్రస్తుతం టెక్నాలజీ యుగం. మనిషి తన జీవన శైలిని సులభం చేసుకునేందుకు టెక్నాలజీపై ఆధారపడుతున్నాడు. ఇందుకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలు చేసుకుంటున్నారు. అందులో భాగమే ప్రస్తుత సెల్‌ఫోన్. సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చింది. ఎక్కడ ఉన్నా.. ఎవరితో అయినా మాట్లాడే వెసులుబాటు కలిగింది. ఫోన్‌ను వెంట తీసుకెళ్లడానికి అవకాశం కలిగింది. ఇక ఈ ఫోన్లలో అనేక మార్పులు చేర్పుల తర్వాత ఇప్పుడు ఫోనే జీవితంగా మారింది. మన వ్యక్తిగత వివరాలు, లావాదేవీలు, సమాచార కేంద్రంగా కూడా ఆన్ డ్రాయిడ్ ఫోన్ మారిపోయింది. దీంతో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరగడం మొదలైంది. సైబర్ కేటుగాళ్లు ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌ను హ్యాక్ చేసి మన వివరాలు సేకరిస్తున్నారు. పర్సనల్ డాటా చోరీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తస్కరిస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ సాయంతోనే చేస్తున్నారు. దీంతో సాంకేతిక విప్లవం మనకు ఎంత ఉపయోగపడుతుందో అంతకన్నా ఎక్కువగా నష్టం కూడా కలిగిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా మను తెలియకుండానే చాలా మంది మనకు మెస్సేజ్‌లు, ఆన్‌లైన్ లింకులు పంపిస్తున్నారు. దీంతో సైబర్ నేరాలకు మరింత ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ అథారిటి ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు స్పామ్ మెస్సేజ్‌లు, కాల్స్‌పై ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ట్రాయ్ స్పామ్ క ఆల్స్, మెస్సేజ్‌లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.
మోసాల నుంచి రక్షించేందుకు..
మెసేజింగ్ సర్వీసులను వినియోగించుకుని జరిగే మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షించేందుకు ట్రాయ్ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 14 సిరీస్లో ప్రారంభమయ్యే టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను బ్లాక్ చెయిన్ సాయంతో పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీకి మార్చాలనని టెలికాం కంపెనీలకు సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30ని గడువుగా నిర్దేశించింది. దీనివల్ల టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను నిఘా, నియంత్రణ సాధ్యపడుతుందని ట్రాయ్ పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని టెలికాం కంపెనీలు.. వెబ్‌సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌పామ్‌లతో కూడిన మెస్సేజ్‌లను పంపించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. వైట్‌లిస్ట్ కాని కాల్‌బ్యాక్ నంబర్లు ఉన్నా ఆ సందేశాలు నిలిపివేయాలని సూచించింది. మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకూ కొత్త నిబంధనలను జారీ చేసింది. టెలీమార్కెటింగ్ చైన్‌తో సరిపోని, గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్ 1 నుంచి పూర్తిగా రిజెక్ట్ చేయాలని సూచించింది.
పెరుగుతున్న మోసాలు..
రోజురోజుకూ పెరుగుతున్న స్పామ్ కాల్స్‌ను నియంత్రించడంపై ట్రాయ్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా అనధికారిక కాల్స్, ప్రమోషనల్ కాల్స్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిజిస్టర్ కాని టెలీ మార్కెటర్ల కాల్స్‌ను బ్లాక్ చేయాలని ఇటీవల ఆదేశించింది. అలాగే, ఎస్సెమ్మెస్ టెంప్లాట్లను దుర్వినియోగంపైనా నిఘా పెట్టింది. సాధారణంగా వ్యాపార సంస్థలకు తమ సబ్‌స్క్రైబర్లకు సందేశాలు పంపించేందుకు హెడర్లను కేటాయిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా మెసేజ్ హెడ్లు, కంటెంట్ టెంప్లెట్స్‌ను ఉల్లంఘిస్తే.. వెంటనే ఆ హెడర్, కంటెంట్ టెంప్లేట్స్ నుంచి ట్రాఫిక్ ను తక్షణమే నిలిపివేయాలని తాజా ఆదేశాల్లో ట్రాయ్ పేర్కొంది.