Smartphone Charge : నిమిషంలోనే స్మార్ట్ ఫోన్ 100% చార్జ్ ..

ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇతర పరికరాలు త్వరగా చార్జ్ అయితేనే డిమాండ్ కు అనుగుణంగా కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే ఇలాంటి ఆవిష్కరణలు త్వరగా అందుబాటులోకి రావాలని యోచిస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 5, 2024 8:57 pm

smartphone charge

Follow us on

Smartphone charge : ఈ స్పీడ్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది అత్యంత అవసరమైపోయింది. మాట్లాడే మాటల నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాల వరకు.. ప్రతి ఒక్క విషయానికి స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరైపోయింది. ఇన్ని పనులు జరుగుతాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చూస్తుండగానే నిండుకుంటుంది.. ఇలాంటప్పుడు చాలామంది తమ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం టర్బో చార్జింగ్ వంటివి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. దానికి కూడా తక్కువలో తక్కువ పావుగంట నుంచి 30 నిమిషాల వరకు టైం తీసుకుంటోంది. ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ చార్జింగ్ కు అంత సమయం కేటాయించాలంటే ఎవరికైనా కష్టమే.. ఇలాంటి తరుణంలో సరికొత్త ఆవిష్కరణ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఆశా దీపం లాగా కనిపిస్తోంది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ లో భారత సంతతికి చెందిన అంకూర్ గుప్తా అనే శాస్త్రవేత్త పని చేస్తున్నారు.. ఈయన బృందం కొన్ని సంవత్సరాల నుంచి “స్మార్ట్ ఫోన్ చార్జింగ్ ఒక్క నిమిషంలోనే అయితే ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్ పది నిమిషాల్లోనే చార్జ్ అవ్వడం సాధ్యమేనా”అనే విషయాల మీద పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే ఈ సౌలభ్యాలు అందుబాటులోకి రాకపోవచ్చు గాని.. త్వరలో మాత్రం చెంతకే వచ్చే అవకాశం ఉంది. అంకుర్ గుప్తా, ఆయన బృందం కొంతకాలంగా స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా చార్జింగ్ అయ్యే విధానంపై పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు తన ప్రయోగంలో భాగంగా అతి సూక్ష్మ రంధ్రాల సముదాయంలో అయాన్ ల రూపంలో ఉన్న ఆవేశిత కణాలు ఎలా కదులుతాయో అంచనా వేశారు. ఇప్పటివరకు ఒక రంధ్రం మీదుగానే ఇవి కదులుతాయని శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే ఇవి అంతర్గతంగా అనుసంధానమైన లక్షలాది రంద్రాల సంక్లిష్ట మార్గాల మీదుగా వెళ్తాయని అంకుర్ గుప్తా బృందం గుర్తించింది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అయాన్ లను ప్రేరేపించవచ్చు. వాటి కదలికలను పసిగట్టవచ్చు. దీనివల్ల మరింత సమర్థవంతమైన సూపర్ కెపాసిటర్లకు మార్గం సుగమం అవుతుంది. సూపర్ కెపాసిటర్ల ద్వారా విద్యుత్ నిల్వ చేసుకోవచ్చు. సూపర్ కెపాసిటర్లు వాటిలో ఉన్న సూక్ష్మ రంధ్రాలలో అయాన్ లు పోగు కావడం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.. దీనివల్ల మామూలు బ్యాటరీలతో పోలిస్తే పరికరాలను త్వరగా విద్యుత్తును ఛార్జ్ చేస్తాయి. అంతేకాదు మరింతకాలం మన్నే విధంగా తోడ్పడుతాయి. వీటి సామర్థ్యం ఎంత పెరిగితే పరికరాలు అంత వేగంగా చార్జ్ అవుతాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు మాత్రమే కాకుండా విద్యుత్ గ్రిడ్ కు కూడా ఈ ఆవిష్కరణ అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు విద్యుత్ ను వీలైనంత నిల్వ చేసుకోవచ్చు. డిమాండ్ పెరిగినప్పుడు నిలువ చేసిన కరెంటు నిరంతరాయంగా సరఫరా చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ ఆవిష్కరణ ప్రయోగ దశలోనే ఉంది. ప్రస్తుత కాలంలో వాహనాల వినియోగం పెరగడం వల్ల చమురు నిలువలపై ఒత్తిడి అధికమవుతోంది. దీనివల్ల భవిష్యత్తు అవసరాలు ఎలక్ట్రిక్ వాహనాలే తీరుస్తాయని పరిశోధకులు నమ్ముతున్నారు. అందువల్ల ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇతర పరికరాలు త్వరగా చార్జ్ అయితేనే డిమాండ్ కు అనుగుణంగా కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే ఇలాంటి ఆవిష్కరణలు త్వరగా అందుబాటులోకి రావాలని యోచిస్తున్నారు.