Zimbabwe Vs Sri Lanka: ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకున్న జింబాబ్వే జట్టు.. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్ లో కూడా అద్భుతం చేసింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, జింబాబ్వే జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసేది. శ్రీలంక జట్టులో నిస్సాంక (62) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు . పవన్ రత్న నాయకే(44) జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఈ మ్యాచ్లో తొలి వికెట్ కు శ్రీలంక జట్టు 54 పరుగులు నమోదు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా వంద పరుగుల వద్ద రెండవ వికెట్, 108 పరుగుల వద్ద మూడో వికెట్, 123 పరుగుల వద్ద నాలుగో వికెట్, 142 పరుగుల వద్ద ఐదో వికెట్, 164 పరుగుల వద్ద ఆరో వికెట్, 164 పరుగుల వద్దనే ఏడో వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో శ్రీలంక జట్టు 61 పరుగులు చేసింది.
సొంత మైదానం కావడంతో శ్రీలంక జట్టు జింబాబ్వే జట్టు మీద గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఇటీవల ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద శ్రీలంక జట్టు గెలిచింది. కానీ జింబాబ్వే శ్రీలంక జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. 179 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన జింబాబ్వే జట్టు 19.3 ఓవర్లలో.. ఫినిష్ చేసింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. జింబాబ్వే జట్టులో బ్రియాన్ బెన్నెట్(63*), మరుమని (34), ర్యాన్ బర్ల్ (23), సికిందర్ రాజా (45) సత్తా చూపించారు. ఫలితంగా జింబాబ్వే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రీలంక జట్టులో హేమంత రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో జింబాబ్వే జట్టు ఒక్క ఓటమి లేకుండా లీగ్ దశను ముగించింది. సూపర్ 8 దశలోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది.
ఈ టోర్నీలో జింబాబ్వే జుట్టు మీద ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. అయితే ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత జింబాబ్వే జట్టు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా మీద సాధించిన విజయాన్ని శ్రీలంకపై కూడా కొనసాగించడంతో.. జింబాబ్వే జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయింది. జింబాబ్వే జట్టు బౌలర్లు.. బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా సికిందర్ రాజా నాయకత్వంలో జింబాబ్వే జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. అందువల్లే వరుస విజయాలు సాధించి.. సంచలనమైన ప్రదర్శన చేస్తోంది.